Page Loader
Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక
యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక

Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా పాకిస్థాన్‌ నిరంతరం భారత్‌పై విద్వేషపు రాగం పలికే విధానాన్ని అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఏడు బృందాలను విదేశాలకు పంపనుంది. ఈ బృందాల్లో ఒకదాంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బహంపుర్‌ ఎంపీ యూసఫ్‌ పఠాన్‌ను కేంద్రం ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై తృణమూల్‌ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో యూసఫ్‌ స్వయంగా ఆ బృందం నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ఈ బృందంలో తృణమూల్‌ తరఫున భాగస్వామిగా ఎంపిక చేసింది.

వివరాలు 

కేంద్రంపై  అభిషేక్‌ బెనర్జీ  విమర్శలు

ఈ విషయాన్ని పార్టీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంలో తమ పార్టీ కూడా భాగస్వామి కావడం గర్వకారణమని పేర్కొంది. అభిషేక్‌ బెనర్జీ ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా బెంగాల్‌ ఉగ్రవాదంపై తన గట్టి వైఖరిని ప్రదర్శిస్తారు అని, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజల సంయుక్త స్వరాన్ని వినిపిస్తారని ప్రకటించింది. ఈ అంశంపై అభిషేక్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ,కేంద్రంపై విమర్శలు చేశారు. తమ పార్టీ ప్రభుత్వానికి జాతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల విషయంలో పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అయితే తృణమూల్‌ పార్టీని సంప్రదించకుండా యూసఫ్‌ పఠాన్‌ను దౌత్య బృందంలో చేర్చడం సరైన ప్రక్రియ కాదని పేర్కొన్నారు.

వివరాలు 

ఆపరేషన్‌ సిందూర్‌ తో భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో దౌత్య యుద్ధానికి తెర

ఏ పార్టీకి చెందిన ఎంపీని ఈ రకమైన బృందాల్లో భాగం చేయాలంటే ముందుగా ఆ పార్టీతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, మరుసటి రోజే పార్టీ తరఫున ఆయన్నే బృందంలో చేర్చడం ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది. ఇక ఉగ్రవాద ఘటనలలో ఒకటైన పహల్గాం దాడిని నేపథ్యంగా తీసుకుని, ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) అనే పేరుతో భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో దౌత్య యుద్ధానికి తెరతీసింది. ఈ దౌత్యబృందంలో మొత్తం 51 మంది నాయకులు, అధికారులను ఏడు బృందాలుగా విభజించి విదేశీ పర్యటనలు నిర్వహించనున్నారు.

వివరాలు 

ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్‌

ఈ బృందాల్లో రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఉన్న నాయకులు, మాజీ ఎంపీలు, మంత్రులు, అనుభవజ్ఞులైన దౌత్యవేత్తలు ఉంటారు. ప్రతీ బృందంలో ఒక ముస్లిం నాయకుడు లేదా అధికారి తప్పనిసరిగా ఉండేలా పథకం రూపొందించారు. మొత్తం 51 మందిలో 31 మంది ఎన్డీయేకు చెందినవారు కాగా, మిగతా 20 మంది ఎన్డీయేతర పార్టీలకు చెందిన నాయకులు. "ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్‌" అనే నినాదంతో ఈ పర్యటనలు చేపట్టారు.