Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.
తమిళనాడులోని శివగంగై జిల్లా సలుగైపురం గ్రామంలో మాత్రం ప్రత్యేకమైన విధానంలో ఈ పండుగను నిర్వహిస్తారు.
ఇక్కడి ఓ వర్గం ప్రజలు పచ్చైనాచ్చి బిటారి, పొన్నళగి అమ్మవార్లను తమ కులదైవాలుగా పూజిస్తారు.
కనుమ రోజున ఇక్కడి మహిళలు గాజులు, మెట్టెలు వంటి ఆభరణాలను ధరించకుండా, తెల్లచీర కట్టుకొని, తలపై కుండలు పెట్టుకొని అమ్మవారి ఆలయాల ముందు పొంగళ్లు పెడతారు.
ఈ ఆచారం ద్వారా దేవతల ముందు ధనిక, పేద తేడా లేకుండా అందరూ సమానమే అని తెలియజేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మరో విశిష్ట ఆచారం కూడా ఉంది.
Details
నిమ్మకాయలతో మొక్కు చెల్లిస్తారు
గుడి ముందు చెరకు ఊయల కట్టి, అందులో నిమ్మకాయలు పెట్టి మొక్కులు చెల్లిస్తారు.
ఆ తర్వాత ఆ నిమ్మకాయలను వేలం వేస్తారు. ఈ నిమ్మకాయలు కొంటే మనసులో అనుకున్న కార్యాలు నెరవేరతాయని గ్రామస్థుల నమ్మకం.
ఈ కారణంగా ఒక్కో నిమ్మకాయ సుమారు రూ.40 వేలు, చెరకుగడలు సుమారు రూ.16 వేలు వరకు ధర చేస్తాయి.
ఇంకా సేలం జిల్లా నత్తకరై గ్రామంలోని 300 ఏళ్ల నల్లసేవన్ ఆలయంలో ఐదేళ్లకోసారి పొంగల్ పండుగ సందర్భంగా చుట్టుపక్క గ్రామాల నుంచి వివాహిత మహిళలు వితంతు వేషంలో వచ్చి సూర్యోదయానికి ముందే పొంగళ్లు పెట్టి తమ మొక్కులను తీర్చుకుంటారు.
Details
ఆడపిల్లలతో కుమ్మీ ఆడించే ఆచారం
పుదుకోట్టై జిల్లా సెరియలూర్ గ్రామంలో ఆడపిల్లలు బతుకమ్మ పండుగలా కుమ్మీ అనే జానపద నృత్యాన్ని ఆడతారు.
రజస్వల కాని ఆడపిల్లలు ముందుగా వ్రతం చేసి, సంక్రాంతి రోజున పొంగళ్లు వండి, పువ్వులు, వేప, చెరకు, బెల్లం వంటి పదార్థాలతో వెదురు బుట్టను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్తారు. అటవీ ప్రాంతంలో ఉన్న రాకాచ్చి అమ్మవారి వద్ద ఈ వస్తువులను ఉంచి కుమ్మీ ఆడతారు.
చివరకు పొంగలిని మినహా మిగిలిన వస్తువులను గొయ్యి తీసి పూడ్చిపెడతారు.
పూర్వకాలంలో పొంగు సోకిన ఓ ఆడపిల్ల పాలచెట్టుపై నుంచి పడి మరణించిందని, అలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో ఈ పండుగలో 'అమ్మవారి వ్యాధి' నివారణకు మూలికలతో ఊరేగింపుగా వెళ్లి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు విశ్వసిస్తారు.