Batukamma: బతుకు చిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు
బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవంగా జరుపుకుంటారు. ఇది తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా నిలుస్తుంది. స్త్రీలు ఒకచోట చేరి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహభరితంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేవి బతుకులోంచి పుట్టిన పాటలు. తొమ్మిది రోజులపాటు వీధులన్నీ ఈ పాటలతో మార్మోగుతుంటాయి.
ఈ పాటలలో పూర్వీకుల లక్షణాలు, వారి జీవనశైలి, ఆనాటి సామాజిక దృక్పథం
ఈ బతుకమ్మకు చారిత్రక, శాస్త్రీయ, సామాజిక, శారీరక, ఆధ్యాత్మిక, మానసిక నేపథ్యాలు ఉన్నాయని ఉపాధ్యాయురాలు శార్వరి దేవి వివరించారు. ఈ పాటల్లో మన చరిత్ర, సాంప్రదాయం సంతరించుకున్నాయి. పూర్వీకుల లక్షణాలు, వారి జీవనశైలి, ఆనాటి సామాజిక దృక్పథం ఈ పాటల్లో ప్రతిఫలిస్తాయి. ఈ పాటల్లో ఆధ్యాత్మిక భావాలు మాత్రమే కాకుండా కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాలు కూడా పొందుపరచబడ్డాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో, గర్భిణీ స్త్రీలు పాడే పాటలు ప్రత్యేకం. తొమ్మిది నెలల గర్భిణీ అనుభవాలు, వారి కోరికలు పాట రూపంలో వ్యక్తమవుతాయి. ఒక ప్రఖ్యాత గీతంలో, "ఒకటో మాసము నెలతర గర్భిణీ ఏమికొరను వలలో" అంటూ గర్భిణీ స్త్రీలు ఏమి కోరుకుంటారో తెలియజేస్తుంది.
ఆ ఆటలు, పాటలు మళ్లీ రావాలని..
కుటుంబ జీవనాన్ని కూడా ఈ పాటలు ప్రస్తావిస్తాయి. ఒక కోడలు అత్తవారింట చేరినప్పుడు ఎలా మెలగాలి, భర్తతో, వదినతో సంబంధాలు ఎలా ఉండాలో పూర్వీకులు పాట రూపంలో తెలియజేశారు. ఉదాహరణకు, "అత్తమామల సేవ వలలో" అనే పాటలో, తల్లిదండ్రుల సేవకు సంబంధించిన విలువలు వివరించబడ్డాయి. కూడా, పెళ్లయిన అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి చెప్పే నడతలను పాటల రూపంలో పూర్వీకులు వివరించారు. ఈ పాటల ద్వారా కుటుంబ విలువలు, బతుకమ్మ విశిష్టతను మన పూర్వీకులు ఈ తరానికి అందించారు. అయితే, ఆధునిక కాలంలో డీజే పాటలు ఎక్కువగా వినిపిస్తుండటంతో సనాతన ధర్మంలోని విలువలతో నడిచే పాటలు, కోలాటాలు కొరవడుతున్నాయి. పూర్వీకుల కాలం నాటి ఆ ఆటలు, పాటలు మళ్లీ రావాలని కోరుకుందాం.