Page Loader
BEST HILLSTATIONS: హైదరాబాద్ నుండి  ఒక్కరోజులో వెళ్లి వచ్చే.. హిల్​స్టేషన్స్​ ఇవే!
హైదరాబాద్ నుండి ఒక్కరోజులో వెళ్లి వచ్చే.. హిల్​స్టేషన్స్​ ఇవే!

BEST HILLSTATIONS: హైదరాబాద్ నుండి  ఒక్కరోజులో వెళ్లి వచ్చే.. హిల్​స్టేషన్స్​ ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలతో కలిసి ట్రిప్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా ఎక్కువ రోజులు వెళ్తే ఇబ్బంది అవుతుందని అనిపించేవారూ లేకపోలేదు. అందువల్ల, ఒకటి లేదా రెండు రోజుల్లోనే వెళ్లొచ్చే పర్యాటక ప్రదేశాల కోసం వారు వెతుకుతుంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచనలో ఉంటే, ఈ కథనం మీ కోసమే. ప్రకృతి ఒడిలో కుటుంబంతో హాయిగా గడిపేందుకు అనువైన, ముఖ్యంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కొన్ని అద్భుతమైన హిల్ స్టేషన్లను ఇప్పుడు చూద్దాం. వీటికి ట్రావెల్ ఖర్చులు కూడా ఎక్కువ కావు.

వివరాలు 

1. అనంతగిరి కొండలు

చాలామంది సందర్శించే హిల్ స్టేషన్‌లలో అనంతగిరి కొండలు ఒకటి. హైదరాబాద్‌ నుంచి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రదేశం, దట్టమైన అడవులతో, ప్రవాహించే వాగుల మధ్య నడిచే ట్రిప్‌ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్, బోటింగ్, రాక్ క్లైంబింగ్, నేచర్ వాక్,ఫోటోగ్రఫీ కోసం అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే, భవనాసి సరస్సు, వికారాబాద్ టౌన్, అరకు మ్యూజియం వంటి ప్రదేశాలు ఇక్కడ సమీపంలో ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది. ఒకే రోజు వెళ్లి తిరిగిరావచ్చు. కానీ స్టే చేయాలనుకుంటే హోటళ్లు కూడా అందుబాటులో ఉంటాయి.

వివరాలు 

2. నల్లమల కొండలు 

నగర జీవన రణగోణ ధ్వనులు, కోలాహలానికి విరామంగా ప్రశాంతత కోరేవారికి నల్లమల కొండలు చక్కటి ఎంపిక. హైదరాబాద్ నుంచి సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్నాయి. ఈ పర్వత శ్రేణిని కృష్ణా, పెన్నా నదులు చుట్టుముట్టి ప్రవహిస్తుంటాయి. ఇక్కడి దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ఇతర ఆకర్షణగా మానవ నిర్మిత కంబం సరస్సు ఉంది. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

వివరాలు 

3. శ్రీశైలం 

అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సాహస యాత్రలు ఆస్వాదించాలనుకునేవారికి శ్రీశైలం హిల్ స్టేషన్ అద్భుతమైన ఎంపిక. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్నది. హైదరాబాద్ నుంచి సుమారు 215 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి ముఖ్య ఆకర్షణలలో ఆధ్యాత్మికతతో నిండిన పుణ్యక్షేత్రాలు, ఘాట్ రోడ్డులో ప్రయాణం, గుహలు, దట్టమైన అడవులు, జలపాతాలు మరియు లోయలు ఉన్నాయి. నాగార్జున సాగర్-శ్రీశైలం అభయారణ్యం, కామేశ్వరి ఆలయం, శ్రీశైలం డామ్, ఉమా మహేశ్వరం ఆలయం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు తప్పకుండా చూడవలసినవి.