Indrakeeladri: మూలానక్షత్రం.. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో బుధవారం భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులను పోలీసులు కంపార్ట్‌మెంట్‌లలో ఉంచి క్యూలలో పంపిస్తున్నారు,అలాగే దర్శనం చేసిన వెంటనే భక్తులను త్వరగా దిగువకు పంపిస్తున్నారు. రద్దీని నియంత్రించడానికి 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడికి ఆలయ సిబ్బంది ఉచితంగా ఒక లడ్డూను అందిస్తున్నారు. నగరంలోని వినాయకగుడి, కుమ్మరిపాలెం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు విచ్చేశారు. నేడు టికెట్ దర్శనాలను రద్దు చేసి, వేకువజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం అందించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
మూలా నక్షత్రం విశిష్టత
మూలా నక్షత్రం దుర్గమ్మ జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన అనంతరం దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవత సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొందుతారని, సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు దుర్గమ్మను విశేష పుణ్య దినాలుగా భావించి ఆరాధిస్తారు. సరస్వతీదేవి భక్తుల అజ్ఞానాన్ని పారదోలుతూ జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని. ఆమె దర్శనం అఖిల విద్యాభ్యుదయానికి దారి తీస్తుంది.