వర్కౌట్స్ చేసిన తర్వాత మీ శరీరాన్ని చల్లబరిచే యోగాసనాల గురించి తెలుసుకోండి
వర్కౌట్స్ చేసిన తర్వాత కూల్ డౌన్ వ్యాయమాలు చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, శ్వాస సాధారణంగా మారుతుంది, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం శరీరాన్ని చల్లబరుచుకోవడానికి పనికొచ్చే యోగాసనాలు ఏంటో తెలుసుకుందాం. బాలాసనం: మోకాళ్ళ మీద కూర్చుని నడుము భాగాన్ని కిందకు వంచి తలను నేలకు ఆనించాలి. చేతులను తలకు సమాంతరంగా ముందుకు చాపాలి. ఈ పొజిషన్లో 20-30సెకండ్లు ఉన్న తర్వాత రిపీట్ చేయాలి. శవాసనం: వెల్లకిలా పడుకుని రెండు పాదాల మధ్య కొంచెం దూరాన్ని ఉంచి విశ్రాంతిగా పడుకోవాలి. కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా మూడు నిమిషాల పాటు చేయాలి.
కండరాలకు విశ్రాంతి కలిగించే యోగాసనాలు
మలాసనం: కాళ్ల మధ్య కొంచెం దూరం ఉంచి గుంజీలు తీసేటప్పుడు కూర్చునే విధంగా కూర్చోవాలి. ఇప్పుడు రెండు చేతులతో నమస్కారం చేయాలి. ఇలా చేయడం వల్ల నడుము, మోకాలి భాగాల్లోని కండరాలు రిలాక్స్ అవుతాయి. సేతుబంధ సర్వాంగాసనం: వెల్లకిలా పడుకుని మోకాళ్ళను వంచి పాదాలను మీ పిరుదుల దగ్గరకు తీసుకురండి, నడుము, ఛాతి భాగాన్ని నెమ్మదిగా పైకి లేపాలి. రెండు చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 30సెకండ్లు ఉన్న తర్వాత రిపీట్ చేయాలి. విపరీత కారణి: గోడకు వ్యతిరేక దిశలో వెల్లకిలా పడుకుని నడుము భాగం నుంచి కాళ్ల వరకు పైకి లేపాలి. ఆ తర్వాత పిరుదుల పైన చేతులు పెట్టి నడుము భాగాన్ని కూడా పైకి లేపాలి.