Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు?
పూలను దైవంగా ఆరాధించే ప్రత్యేక వేడుక బతుకమ్మ, దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక రోజు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ వేడుకలు అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగ ప్రస్తుతం దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రఖ్యాతిని పొందింది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు ప్రతి రోజు వైవిధ్యమైన బతుకమ్మను పేర్చుకుని పండుగ సంబరాలు నిర్వహిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అలిగిన బతుకమ్మకు,ఒక రోజు మినహాయించి,మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా స్తూపం,శంఖం,గోపురం ఆకారంలో అమర్చడం జరుగుతుంది.
బతుకమ్మ పండుగ తేదీలు
బతుకమ్మ పండగ అక్టోబర్ 2 నుండి ప్రారంభమవుతుంది, ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రోజు సమర్పించే నైవేద్యం ఏమిటో తెలుసుకుందాం.
ఎంగిలి పూల బతుకమ్మ కథ
బతుకమ్మ చేసుకోవడానికి ముందు రోజు నుంచే ఆడవాళ్లు పొలాలు, చెట్లు, గట్టులు తిరుగుతూ అందమైన రంగురంగుల పూలను కోసి తెచ్చుకుంటారు. మొదటి రోజున చేసే ఎంగిలి పూల బతుకమ్మలో సిబ్బిలు, తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీత జడలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముందుగా తంగేడు పూలు అమర్చిన తరువాత, రంగుల ఆధారంగా ఇతర పూలను ఏర్పాటు చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ తయారికి, పూలను ముందుగా నీటిలో వేసి ఉంచుతారు, తద్వారా పూలు నిద్ర చేస్తాయి. అందుకే దీనిని ఎంగిలి పూలు అంటారు.పూల ఆకులు, కాడలు కత్తెర లేదా నోటితో కట్ చేస్తారు, దీని ద్వారా 'ఎంగిలి' అని అర్థం వస్తుంది.
నైవేద్యం ఏమిటి?
పితృ పక్ష అమావాస్య రోజున బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు. ఈ రోజున అనేక మంది తమ పెద్దలను, పూర్వీకులను గుర్తుచేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు. భోజనం చేయడాన్ని 'ఎంగిలి పడటం' అంటారు, అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తారు. తెలంగాణ ప్రజలు పితృ పక్ష అమావాస్యను 'పెత్రమాస' అంటారు. ఈ విధంగా ఎంగిలి పూల బతుకమ్మ అనడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.ఈ రోజున గౌరీ దేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు. నువ్వులు,బియ్యం పిండి,నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి.