యోగా: విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటను దూరం చేసే యోగాసనాలు
వేరు వేరు టైమ్ జోన్లలో ప్రయాణించినపుడు నిద్ర దెబ్బతింటుంది. విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటతో పాటు టైమ్ జోన్ మారిపోయినపుడు నిద్ర సరిగ్గా పట్టదు. అంతేగాకుండా తీవ్రమైన అలసట శరీరాన్ని చేరుతుంది. ఇలాంటి పరిస్థితి మీరు చేరుకున్న ప్రాంతపు టైమ్ జోన్ కి అలవాటు పడేవరకూ ఉంటుంది. అయితే ఆ పరిస్థితిని తగ్గించి, కొత్త టైమ్ జోన్ కి తొందరగా అలవాటు పడాలంటే కొన్ని యోగాసనాలు చేయాలి. సేతు బంధ సర్వాంగసనం: వెల్లకిలా పడుకుని మోకాళ్ళను మడిచి కుడి చేతితో కుడి మడమను, ఎడమ చేతితో ఎడమ మడమను పట్టుకుని తలను నేలకు బలంగా ఆనించి, నడుము భాగాన్ని గాల్లోకి లేపాలి. ఇలా కొద్దిసేపు ఉండాలి.
విమాన ప్రయాణ అలసటను దూరం చేసే ఆసనాలు
ఉస్త్రాసనం: ప్రయాణం వల్ల కలిగిన అలసటను, కండరాల బిగుతును దూరం చేస్తుంది ఈ ఆసనం. మోకాళ్ల మీద కూర్చుని, బాడీని వెనక్కి వంచి పాదాలను అరచేతులతో పట్టుకోవాలి. సూర్య నమస్కారం: సూర్య నమస్కారాల్లోకి ఆసనాలు చేయడం వల్ల బిగుతుగా మారిన శరీరం ఫ్రీ అవుతుంది. కొత్త ఎనర్జీ వస్తుంది. ఎక్కువ సేపు విమాన ప్రయాణాలు చేయడం వల్ల శరీరం మొత్తం బిగుతుగా మారిపోతుంది. సూర్య నమస్కారం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఆనంద బాలాసనం: వెల్లకిలా పడుకుని కాళ్ళను పైకి లేపి పాదాలను చేతులతో పట్టుకోవాలి. ఈ టైమ్ లో మీ మోకాళ్ళు పక్కటెముకలకు పక్కవైపు ఉండాలి. మోకాళ్ళను నేలకి ఆనించేలా ప్రయత్నం చేయండి. (నేలను తాకకపోయినా ఫర్వాలేదు).