LOADING...
Kissing bugs: అమెరికాలోని 32 US రాష్ట్రాలలో 'కిస్సింగ్ బగ్స్' ముప్పు .. వెంటాడుతున్నచాగాస్ వ్యాధి భయం
వెంటాడుతున్నచాగాస్ వ్యాధి భయం

Kissing bugs: అమెరికాలోని 32 US రాష్ట్రాలలో 'కిస్సింగ్ బగ్స్' ముప్పు .. వెంటాడుతున్నచాగాస్ వ్యాధి భయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఆరోగ్య శాఖ అధికారులు ఒక కొత్త హెచ్చరిక జారీ చేశారు. 'కిస్సింగ్ బగ్స్' అనే పురుగులు 32 రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ పురుగులు "చాగాస్" అనే ప్రాణాంతక వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ఈ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్‌లకు దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

కిస్సింగ్ బగ్స్ అంటే ఏమిటి?

'కిస్సింగ్ బగ్స్' అసలు పేరు ట్రయాటొమైన్ (Triatomine) పురుగులు. ఇవి నల్లటి-గోధుమ రంగులో ఉండి, మనుషులు, పెంపుడు జంతువులు, అడవి జంతువుల రక్తాన్ని పీలుస్తాయి. సాధారణంగా రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు,పెదవులు లేదా కళ్ల దగ్గర కరిచే అలవాటు వీటికి ఉంది. అందుకే వీటిని "కిస్సింగ్ బగ్స్" అని పిలుస్తారు.ఈ పురుగులు మెక్సికో,మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో 21 దేశాల్లో సాధారణంగా ఉంటాయి. అమెరికాలో మాత్రం తాజాగా ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా రాష్ట్రాల్లో విస్తృతంగా కన్పిస్తున్నాయి.

వివరాలు 

చాగాస్ వ్యాధి ఎలా వస్తుంది? 

ఈ పురుగులు చాగాస్ వ్యాధికి కారణమయ్యే ట్రిపానోసోమా క్రూసి (Trypanosoma cruzi) అనే పరాన్నజీవిని కలిగి ఉంటాయి. సాధారణంగా పురుగు కరిచిన దగ్గర విసర్జన చేయడంతో, మనిషి గోకడం లేదా రుద్దుకోవడం వలన పరాన్నజీవి శరీరంలోకి వెళ్తుంది. టెక్సాస్, దక్షిణ కాలిఫోర్నియాలో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా బయటపడ్డాయి.

వివరాలు 

వ్యాధి లక్షణాలు 

చాగాస్ వ్యాధి రెండు దశల్లో ఉంటుంది. తీవ్ర దశ (కొన్ని వారాల నుండి నెలల వరకు): కొంతమంది రోగులకు లక్షణాలు కనిపించవు. మరికొందరికి జ్వరం, దద్దుర్లు, శరీర నొప్పులు, తలనొప్పి, కరిచిన చోట వాపు వంటి సమస్యలు వస్తాయి. కళ్లపాప వాపు (Romana's sign) ప్రధాన గుర్తుగా పరిగణిస్తారు. దీర్ఘకాల దశ (ఏళ్ల నుండి దశాబ్దాల వరకు): సుమారు 20-30 శాతం రోగుల్లో గుండె సమస్యలు, హృదయ విఫలం, హృదయ రిధం లోపాలు, జీర్ణవ్యవస్థలో వాపులు, అకస్మాత్తుగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది ప్రాణాంతకం అవుతుంది.

వివరాలు 

పరీక్షలు-చికిత్స 

రక్తపరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. వ్యాధి తొలి దశలో బెంజ్నిడాజోల్ (Benznidazole), నిఫర్టిమాక్స్ (Nifurtimox) అనే మందులు ఉపయోగిస్తారు. కానీ వ్యాధి దీర్ఘదశలోకి వెళ్లిన తర్వాత మాత్రం లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స అందించవలసి ఉంటుంది. కొంతమందికి శస్త్రచికిత్స లేదా హృదయ మార్పిడి అవసరం పడవచ్చు. ప్రభావం- వ్యాప్తి 2013 నుంచి 2023 వరకు టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 50 స్థానిక కేసులు రికార్డయ్యాయి. అక్కడి కొన్ని ప్రాంతాల్లో సగం వరకు పురుగులు ఈ పరాన్నజీవిని మోసుకెళ్తున్నాయని అధ్యయనాలు చూపించాయి. కుక్కల పెంపకం కేంద్రాల్లో కూడా 31 శాతం వరకు ఇన్ఫెక్షన్ నమోదైంది. దక్షిణ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్, సాన్ డియాగో ప్రాంతాల్లో కూడా ఇది విస్తసరించింది.

వివరాలు 

జాగ్రత్తలు 

నిపుణుల సూచన ప్రకారం జాగ్రత్తలు మాత్రమే ఉత్తమ రక్షణ.ఇంట్లో గోడలకు ఉన్న రంద్రాలు పూడ్చడం,ఈగలు, దోమలను దూరం చేసే స్ప్రేలు లేదా మందులు వాడడం,మట్టి గోడల గదుల్లో లేదా గుడిసెలలో పడుకోవడం,నిద్రించటం చేయకూడదు. పురుగులను చేతితో తాకకుండా గ్లవ్స్‌తో పట్టుకుని అధికారులకు సమాచారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.