Page Loader
Monaco: ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్లు.. లగ్జరీ లైఫ్‌కి చిరునామా 'మొనాకో'
ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్లు.. లగ్జరీ లైఫ్‌కి చిరునామా 'మొనాకో'

Monaco: ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్లు.. లగ్జరీ లైఫ్‌కి చిరునామా 'మొనాకో'

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌కు ఆగ్నేయ దిశగా ఉన్న మధ్యధరా సముద్ర తీరంలో ఒక చిన్న దేశం ఉంది.. అదే మొనాకో. ఈ దేశ జనాభా కేవలం 38,000 మాత్రమే. అయినా కూడా ఈ దేశంలో ఎటు చూసినా విలాసవంతమైన కారు, ప్రతిష్టాత్మక భవనాలు, చక్కని యాట్‌లు కనబడతాయి. ప్రపంచంలోనే అత్యధిక మిలియనీర్లు ఈ చిన్న దేశంలో నివసిస్తున్నారు. కొంతమంది ఈ దేశంలో స్థిర నివాసం కోసం చూస్తుంటే, మరికొందరికి ఇక్కడ చిరునామా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇక్కడ లగ్జరీ లైఫ్‌స్టైల్‌, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కారణంగా ఇది ధనవంతులకి నిజంగా స్వర్గధామంలా మారింది.

వివరాలు 

సామాన్య దేశం కాదు.. సంపద పరంగా గొప్ప దేశం 

ఇక్కడి వీధుల్లో లాంబోర్గినీ, రోల్స్‌ రాయిస్‌ వంటి ఖరీదైన కార్లు సాధారణంగా దర్శనమిస్తాయి. సముద్రతీరంలో ఫ్లోటింగ్‌ మాన్షన్లు కనిపిస్తాయి. ప్రతిష్టాత్మకమైన మొనాకో గ్రాండ్‌ ప్రిక్స్‌ ఫార్ములా వన్‌ రేసింగ్‌ ఈవెంట్‌ ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌ సమయంలో వీధులన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోతాయి. చిన్న దేశమైనా కూడా సంపద పరంగా ఇది ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడుతోంది. వరల్డ్‌ బ్యాంక్‌ తాజా నివేదిక ప్రకారం, మొనాకోలో తలసరి స్థాయిలో జీడీపీ 2.56 లక్షల డాలర్లు (సుమారు ₹2.18 కోట్లు)గా ఉంది. ఇది అమెరికాలోని తలసరి జీడీపీ (82,000 డాలర్లు) కంటే చాలా ఎక్కువ. ఆశ్చర్యంగా అనిపించే అంశం ఏమిటంటే, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు ధనవంతుడు.

వివరాలు 

పన్నులుండవు, జీవనశైలి మాత్రం లగ్జరీ 

ధనవంతులు మొనాకో వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలున్నాయి. అతి ఉన్నత స్థాయి భద్రత, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, అత్యుత్తమ వైద్య సదుపాయాలు, ముఖ్యంగా ఆదాయపు పన్ను లేకపోవడం. మొనాకోలో వ్యక్తిగత ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. మూలధన లాభాలపై పన్ను లేదు. వారసత్వ పన్ను కూడా తక్కువగా ఉంటుంది. కొందరికి ఉన్నా.. గరిష్ఠంగా అది 16 శాతానికి మించదు. ఇక్కడి ఉన్నతమైన జీవన ప్రమాణాలు, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కూడా ధనవంతులను ఆకర్షించే ప్రధాన కారణాలు.

వివరాలు 

ఒకప్పుడు ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడు..

ప్రస్తుతం ధనవంతుల నివాసంగా మారిన మొనాకో.. ఒకప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 19వ శతాబ్ద ప్రారంభంలో ప్రిన్స్‌ చార్లెస్‌ III తీసుకున్న నిర్ణయాలతో మొనాకో తలరాతనే మార్చేసింది. ఆయన మాంటే కార్లో క్యాసినోను స్థాపించారు. అదే సమయంలో ఆదాయపు పన్నును తొలగించారు. ఫ్రాన్స్‌ పౌరులకు మినహాయింపుతో, ఇతరులకు పన్ను లేకుండా చేసారు.ఈ చర్యలు అనేక ధనికులను మొనాకో వైపు ఆకర్షించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి 1869లోనే ఒప్పందం కుదిరింది. క్యాసినోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ వ్యయాలకు వినియోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కూడా ఇక్కడి దే.

వివరాలు 

ఇక్కడికి రావడం అంత సులభం కాదు.. 

ఇంతగా లగ్జరీతో నిండిన మొనాకోలో నివసించాలంటే కొన్ని కఠిన నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. మొనాకో రెసిడెన్స్‌ కోసం కనీస వయసు 16 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థి పోలీస్‌ క్లియరెన్స్‌ పొందాలి. అంటే ఆయన నేరచరిత్ర లేనివాడని ధ్రువీకరించాలి. అతనికి సొంత ఇల్లు లేదా అద్దెకు తీసుకున్న ఇల్లు ఉండాలి. ఇక్కడ ఉండడానికి ఆర్థికంగా బలంగా ఉన్నామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం పొడవునా కనీసం ఆరు నెలలు మొనాకోలో ఉండాల్సి ఉంటుంది. తక్కువ కాలం ఉంటే అదనపు డాక్యుమెంట్లు అవసరం.

వివరాలు 

ఇలాంటి అవకాశం ఇంకెక్కడ? 

ఆదాయపు పన్ను లేకుండా జీవించడానికి ప్రపంచంలో మొనాకో ఒక్కటే కాదు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), ఖతర్‌, బెర్ముడా, ఒమన్‌, కువైట్‌ వంటి దేశాల్లోనూ ఇదే తరహా ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ, మొనాకో స్థాయికి మాత్రం అవి రాలేవు.