మార్నింగ్ సిక్నెస్: గర్భిణీ మహిళల్లో కనపడే ఈ ఇబ్బంది లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మార్నింగ్ సిక్నెస్ అనే ఇబ్బంది గర్భిణీ మహిళల్లో కలుగుతుంది. అది కూడా మొదటి మూడు నెలల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది ప్రెగ్నెన్సీ మహిళలు ఈ ఇబ్బందితో మొదటి మూడు నెలలు బాధపడతారు. అసలు మార్నింగ్ సిక్నెస్ అంటే ఏమిటి? మార్నింగ్ సిక్నెస్ అంటే వికారంగా అనిపించడం, వాంతులు కావడం అన్నమాట. ఈ ఇబ్బందికి మార్నింగ్ సిక్నెస్ అనే పేరు పెట్టారు కానీ దీని లక్షణాలు కేవలం ఉదయం పూట మాత్రమే కాదు, ఏ సమయంలోనైనా కనిపిస్తాయి. గర్భిణీ మహిళల్లో సాధారణంగా ఆరవ వారంలో మార్నింగ్ సిక్నెస్ లక్షణాలు మొదలై పదవ వారం వరకు ఉంటాయి. 13వ వారం తర్వాత ఈ మార్నింగ్ సిక్నెస్ దానికదే మాయమైపోతుంది.
మార్నింగ్ సిక్నెస్ కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గర్భిణీ మహిళల్లో వాంతులు, వికారం కలగడానికి స్పష్టమైన కారణం ఇప్పటివరకు కనుగొనబడలేదు. హార్మోన్లలో మార్పులు రావడం, రక్తంలో చక్కెర శాతం తగ్గడం, బీపీలో మార్పులు, ఒత్తిడి, యాంగ్జైటీ, అలసట, ఎక్కువగా తినడం, వాతావరణంలో మార్పులు, మలబద్ధకం, ఈస్ట్రోజన్ అధికంగా ఉత్పత్తి కావడం వంటి కారణాల వల్ల కూడా మార్నింగ్ సిక్నెస్ వస్తుందని చెబుతారు. లక్షణాలు ఈ ఇబ్బందితో బాధపడే వారిలో ఒక్కొక్కరిలో లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరిలో వికారం, వాంతులు, గుండె మంట, గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపించడం, గ్యాస్, ఆకలి ఎక్కువగా ఉండడం తలనొప్పి, వర్టిగో వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
మార్నింగ్ సిక్నెస్ ని ఇంటి దగ్గరే తగ్గించుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు లక్షణాలు మరీ తీవ్రమైపోయి ఇతర అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉంది. మార్నింగ్ సిక్నెస్ కారణంగా తీవ్రమైన అలసట, శరీరంలోని ద్రవాలు కోల్పోవడం, మూత్రం రాకపోవడం, గుండె దడ పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.