Music Frogs : పాటలు పాడే కప్పలు చూశారా.. సంగీతంతో మైమరపిస్తున్నాయి
అరుణాచల్ ప్రదేశ్'లో కప్పలు పాటలు పాడుతున్నాయి. ఈ మేరకు తమ సంగీతంతో మైమరపిస్తున్నాయట. ఈ విషయాలే తమను ఆశ్చర్యపరుస్తున్నాయంటున్నారు జువాలజీకి చెందిన శాస్త్రవేేత్తలు. కప్పలు బెకబెక మని అరుస్తాయి. కానీ సంగీతం పాడే కప్పల్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. అయితే ఇది ఏ విదేశాల్లో కాదని, మన భారతదేశంలోనేనని అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీతీరంలో కప్పలు 'సంగీతం'తో మైమరపిస్తున్నాయి. ఈ కొత్తరకం కప్పల్ని అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్తగా కనుగొన్న ఈ కప్పలు ఓ ప్రత్యేకమైన శబ్దాలు చేస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సదరు శబ్దాలు వినేందుకు సంగీతంలాగే ఉంటోందట. ఫలితంగా కొత్త జాతి కప్పలకు శాస్త్రవేత్తలు 'Music Frogs' అని పేరు పెట్టారు.
ఒకే రకమైన సౌండ్ చేస్తున్న ఆడ, మగ కప్పలు
జువాలజీ నిపుణులు బిటుపన్ బోరువా, వి.దీపక్, అభిజిత్ దాస్ అరుణాచల్ ప్రదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీతీరంలో దిహాంగ్ ప్రాంతంలో 'మ్యూజిక్ ఫ్రాగ్' కొత్త జాతి కప్పలను గుర్తించారు. అయితే వీటిలో ఆడ, మగ కప్పలు రెండు కూడా ఒకే రకమైన వింత శబ్దాలు చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మపుత్ర నదీ తీరంలో తొలిసారిగా ఈ రకమైన వింత చప్పుళ్లు విన్నామని, ఇలాంటి శబ్దాలను తాము ఎన్నడూ వినలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2022 ఆగస్టు,సెప్టెంబర్ మద్య కాలంలో ఈశాన్య రాష్ట్రంలోని చాంగ్లాంగ్,లోహిత్ జిల్లాల్లో క్షేత్రస్థాయి సర్వేలు చేసిన శాస్త్రవేత్తలు, నిస్సారమైన నీటి కొలనులో 'బలమైన' శరీరాలతో అరుస్తున్న మగ కప్పలను గుర్తించారు.
2022లో చేసిన సర్వేలో ప్రత్యేకమైన శబ్దాలు చేసే కప్పలను గుర్తించాం : శాస్త్రవేత్తలు
అక్కడి చిత్తడి నేలలు, చెరువుల సమీపాల్లోను, రహదారి వైపు వింత శబ్దాలు వినిపించాయన్నారు. ఈ కొత్తజాతి కప్పలు రకరకాల చప్పుళ్లతో ప్రత్యేకమైన శబ్దాలు చేస్తున్నాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్'లో 2022లో తాము చేపట్టిన సర్వేల్లో కొత్త జాతి కప్పలను కనుగొన్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మగ కప్పలు సుమారు 1.8 అంగుళాల నుంచి 2.3 అంగుళాల పొడవు ఉన్నాయని, ఆడ కప్పలు 2.4 అంగుళాల నుంచి 2.6 అంగుళాల పొడువున్నాయని అంచనా వేశారు. ఈ కప్పలకు దేహం మధ్యలో లేత క్రీం రంగులో గీత ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి శరీరం చాలా మృదువుగా ముదురు గోధుమరంగులో ఉందన్నారు.