
Batukamma: భక్తి, ప్రకృతి,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..
ఈ వార్తాకథనం ఏంటి
బతుకమ్మ పండుగ అనేది పరమాత్మతోనే కాక, ప్రకృతితోనూ మన అనుబంధాన్ని గుర్తు చేసే మహోత్సవం. ఈ పూల పండుగ తెలుగునాటి సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పుష్పాల రూపంలో ఆదిపరాశక్తిని ఆరాధించడం దీని ప్రత్యేకత. జానపదులు తమ మనసులో కొలువైన గ్రామదేవతలను పూజిస్తారు. పాటల రూపంలో తమ భక్తి, ప్రేమ, ఆత్మీయతను వ్యక్తపరుస్తారు.
వివరాలు
స్త్రీల ప్రతిభకు వేదిక
బతుకమ్మ పండగ స్త్రీల అస్తిత్వానికి అద్దం పట్టే వేడుక. ఇందులో మహిళల మనోభావాలు, కళలు, సృజనాత్మకత వెలుగులోకి వస్తాయి. తెలంగాణ ప్రత్యేకమైన సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే బతుకమ్మ నేడు విదేశాల్లోనూ వైభవంగా జరుపుతున్నారు. స్త్రీలు దీన్ని లక్ష్మీ, పార్వతీ దేవతల ప్రతిరూపంగా, శ్రీచక్ర శోభగా, ఇంటి ముత్తయిదువుగా భావించి పూజిస్తారు. ఈ పండుగను సామూహిక శక్తి ఆరాధనగా కూడా పరిగణిస్తారు. రంగురంగుల పూలను శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చి అందంగా అలంకరిస్తారు. ఇది స్త్రీల సృజనాత్మకతకు నిదర్శనం. తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి, మల్లె, మంకెన, కనకాంబరం, గన్నేరు వంటి పుష్పాలతో బతుకమ్మ అందంగా తీర్చిదిద్దుతారు.
వివరాలు
పాటల మాధుర్యం
బతుకమ్మలో పూలతో పాటు పాటలకూ అపారమైన ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు ఈ గీతాల్లో తమ కష్టసుఖాలు, అనుభూతులు, ప్రేమానురాగాలను పంచుకుంటారు. అక్షరాస్యత లేని గ్రామీణ స్త్రీలు కూడా గంభీరమైన తాత్విక భావాలను పాటల్లో వ్యక్తం చేస్తారు. డప్పుల దరువు, కోలాటం వంటి కళారూపాలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. కొంతమంది కవయిత్రులు తమ భక్తి దర్శనాలను గీతాలుగా మార్చగా, మరికొందరు పురాణకథలను బతుకమ్మ పాటలుగా రాసారు. "శ్రీలక్ష్మీ దేవియు ఉయ్యాలో.. సృష్టి బతుకమ్మయె ఉయ్యాలో.." వంటి గీతాలు లక్ష్మీదేవిని బతుకమ్మ రూపంలో స్తుతించిన ఉదాహరణలు. వైకుంఠ మహాలక్ష్మి బతుకమ్మగా అవతరించిందని భక్తులు ఈ పాటల్లో గౌరవించారు.
వివరాలు
వివిధ నైవేద్యాలు..
ఈ పండుగ స్త్రీల పాకశాస్త్ర ప్రతిభకూ నిదర్శనం. అమ్మవారికి పులిహోర, పులగం, పెసలతో చేసిన తీపిపదార్థాలు, పెరుగన్నం, దద్దోజనం, బెల్లపు అన్నం, పాయసం, నెయ్యి అన్నం వంటి ప్రత్యేక వంటకాలను సమర్పిస్తారు. తరువాత వాటిని ప్రసాదంగా పంచి సామాజిక సమైక్యతను ప్రదర్శిస్తారు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే. పండుగ మొదలు పెట్టిన రోజు నుంచి ప్రతి రోజు ఒక ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. చివరి రోజు మాత్రం అన్ని వంటకాలను కలిపి సమర్పించడం ఆనవాయితీ.
వివరాలు
పౌరాణిక నేపథ్యం
బతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించిన ఒక గాథ ప్రకారం.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు గౌరీదేవి మహిషాసురుణ్ణి సంహరించి అలసటతో మూర్ఛపోయింది. అప్పుడు భక్తులు ఆమె మేల్కొనాలని ప్రార్థిస్తూ గీతాలను ఆలపించారు. వారి పాటల ప్రభావంతో తొమ్మిది రోజుల తర్వాత జగజ్జనని మేల్కొంది. అప్పటి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను పాటలతో, పుష్పాలతో జరుపుతూ వచ్చారు. బతుకమ్మ రూపంలో దేవిని పూజిస్తే, ఆ పేరు పెట్టుకుంటే కుటుంబ సౌభాగ్యం, ముఖ్యంగా ఆడపిల్లల కల్యాణం జరుగుతుందని నమ్మకం.
వివరాలు
పూల పరిమళాలు - ఆధ్యాత్మిక భావన
బతుకమ్మలో పుష్పాలకే ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పళ్లెంలో పసుపుతో అష్టదళ పద్మం వేసి, కుంకుమతో అలంకరించి, గుమ్మడాకు వంటి పత్రాలను ఉంచి వాటి చుట్టూ పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. మొదటి రోజు 'ఎంగిలిపూల బతుకమ్మ' పేర్చుతారు. ఆరో రోజు అరిష్టంగా భావించి బతుకమ్మ ఆడరు. చివరి రోజు 'సద్దుల బతుకమ్మ'ను ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం పూల బతుకమ్మల చుట్టూ తేనెటీగలు గూనుకలాడుతుంటే ఆ ఇంటి ఆవరణ పవిత్రమవుతుందని భావిస్తారు. లలితాదేవిని "భ్రమరవాసిని" అని పిలిచే సాంప్రదాయ విశ్వాసమే దీనికి మూలం.