భారతదేశ మసాలా దినుసుల చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు
ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటివి లేకపోతే సినిమాలో మసాలా తగ్గిందని అంటారు. భారతీయులకు మసాలా దినుసులకు మధ్య అనుబంధం ఎంతలా ఉంటుందో చెప్పడానికి పై ఉదాహరణ ఒక్కటి చాలు. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా మసాలా దినుసులు పండించే దేశంగా భారతదేశం పేరు తెచ్చుకుంది. ప్రపంచ సుగంధ ద్రవ్యాల ప్రాంతంగా భారతదేశానికి పేరుంది. చరిత్ర రాయడం కంటే ముందు నుంచి కూడా భారతదేశ ప్రజలు సుగంధ ద్రవ్యాలను పండిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారతదేశ మసాలా దినుసులకు ఏడువేల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్లో మెసెపటోమియా, ఈజిప్ట్, అరేబియా, గ్రీస్ రోమ్ దేశాలు భారతదేశ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాయి. కానీ అవి భారతదేశానికి చెందినవని వాళ్లకు తెలియదు.
మసాలా దినుసుల గురించి అరబ్బుల అబద్ధాలు
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు అరబ్ వ్యాపారస్తులు భారతదేశ నుండి మసాలా దినుసులను కొనుగోలు చేసి పశ్చిమ దేశాలకు అమ్మేవారు. అలా అమ్మేటప్పుడు తాము వాటిని భారతదేశం నుండి కొనుక్కున్నామని చెప్పకుండా రకరకాల అబద్ధాలు చెప్పేవారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీకు చరిత్రకారుడు హెరిడోటస్ ఒక అరబ్ వ్యాపారవేత్త నుండి దాల్చిన చెక్క గురించి ఒక అబద్ధాన్ని విన్నాడు. అదేంటంటే, దాల్చిన చెక్క అరేబియాలోని ఎత్తైన పర్వతాల్లో పెరుగుతుందని చెప్పాడు. పెద్ద పెద్ద పక్షులు గూడు కట్టుకోవడానికి దాల్చిన చెక్కలను తీసుకెళ్లేవి. ఒక్కోసారి వాటి నోటిలో నుంచి ఆ చెక్కలు కింద జారి పడిపోయేవని రకరకాల కథలు చెప్పే వారట.
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా
అయితే 15వ శతాబ్దంలో యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. 1497 వ సంవత్సరంలో వాస్కోడిగామా ఆఫ్రికాను చుట్టివచ్చి 1498 సంవత్సరంలో భారత దేశంలోని కేరళ రాష్ట్రంలో కోజికోడ్ చేరుకున్నాడు. అక్కడ నుండి మసాలా దినుసులను తీసుకుని అతను యూరప్ కి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుండి మసాలా దినుసుల కోసం పశ్చిమ దేశాలు భారతదేశానికి వచ్చాయి.
భారతదేశ మసాలా దినుసుల మార్కెట్ విలువ
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండటైజేషన్ లిస్ట్ ప్రకారం మొత్తం 109 సుగంధ ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అందులో 75 మసాలా దినుసులను భారత దేశంలో పండిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పండించే సుగంధ ద్రవ్యాలలో 70% భారతదేశంలోనే పండిస్తున్నారు. 2022-23 సంవత్సరంలో 31,761 కోట్ల విలువైన మసాలా దినుసులను ప్రపంచానికి భారతదేశం ఎగుమతి చేసింది. 2028 నాటికి భారతదేశం మసాలా దినుసుల మార్కెట్ విలువ 3 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.