Page Loader
Valentines Day Celebrations: వాలెంటైన్స్‌ డే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా..
వాలెంటైన్స్‌ డే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా..

Valentines Day Celebrations: వాలెంటైన్స్‌ డే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి వాలెంటైన్స్‌ డే కార్డు జన్మించిందని విశ్వసిస్తున్నారు. 1415లో, ఓర్లీన్స్‌ డ్యూక్‌ చార్లెస్‌ తన భార్యకు జైలులో నుంచి ప్రేమపూర్వకమైన లేఖలు రాశాడు. ఇవే మొదటి వాలెంటైన్స్‌ డే గ్రీటింగ్స్‌గా గుర్తింపు పొందాయి. ఫిబ్రవరి 12 నుండి 14 వరకు ఫ్రాన్స్‌లోని 'వాలెంటైన్' అనే గ్రామం ఈ వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఈ ఊరు ప్రేమ సందేశాలతో అలంకరించబడి, గ్రీటింగ్‌ కార్డులు, పుష్పాలతో ముస్తాబవుతుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన వాలెంటైన్స్‌ డే సంబరాలు ఇక్కడే జరుగుతాయని భావిస్తారు.

వివరాలు 

ఒక్కో దేశంలో.. ఒక్కో తీరుగా

అర్జెంటీనా: ఈ దేశంలో వాలెంటైన్స్‌ డే ఫిబ్రవరిలో కాకుండా జూలైలో జరుపుకుంటారు. 'ద వీక్‌ ఆఫ్‌ స్వీట్‌నెస్‌' పేరుతో ప్రేమికులు వారం రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు చాక్లెట్లు, స్వీట్స్‌ ఇచ్చి ఆనందాన్ని పంచుకుంటారు. ఫిలిప్పీన్స్‌: ఫిబ్రవరి 14 ప్రేమికులకు ప్రత్యేక రోజు మాత్రమే కాదు, పెళ్లిళ్లకు కూడా ముఖ్యమైన తేదీగా ఉంటుంది. ఈ రోజున అనేక జంటలు ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక వేడుకలో పెళ్లి చేసుకుంటారు. కొరియా: వాలెంటైన్స్‌ డే ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి నెలా 14వ తేదీని ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. మే నెలలో గులాబీల దినోత్సవం,జూన్‌లో ముద్దుల దినోత్సవం,డిసెంబర్‌లో హగ్స్‌ డే వంటి ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి.

వివరాలు 

ఒక్కో దేశంలో.. ఒక్కో తీరుగా

వేల్స్‌: ప్రేమికుల రోజు జనవరి 25న వస్తుంది. 'సెయింట్‌ డ్విన్వెన్‌ దినోత్సవం' పేరుతో జరుపుకునే ఈ రోజున ప్రేమికులు చేతితో చెక్కిన చెక్క స్పూన్‌లను బహుమతిగా ఇచ్చుకుంటారు. ఈ ఆనవాయం 16వ శతాబ్దం నుంచీ కొనసాగుతోంది. డెన్మార్క్‌: వాలెంటైన్స్‌ డే సందర్బంగా ప్రేమికులు 'స్నో డ్రాప్స్‌' అనే తెల్లని పుష్పాలను బహుమతిగా అందిస్తారు. అంతేకాకుండా, కేవలం ప్రేమికులే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు కూడా కానుకలు, గ్రీటింగ్‌ కార్డులు పంపుతారు. ఆఫ్రికా: ఘనా దేశంలో ఫిబ్రవరి 14 'జాతీయ చాక్లెట్‌ దినోత్సవం'గా జరుపుకుంటారు. కోకో ఉత్పత్తిలో ప్రముఖమైన ఘనా, దేశీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రత్యేక వేడుకను ప్రోత్సహిస్తోంది.

వివరాలు 

ఒక్కో దేశంలో.. ఒక్కో తీరుగా

జపాన్‌: వాలెంటైన్స్‌ డే మహిళల ఆధిపత్యంలో ఉంటుంది. ఈ రోజున మహిళలు తమ ప్రియమైన వారికి చాక్లెట్లు అందిస్తారు. అయితే, మార్చి 14న జరిగే 'వైట్‌ డే' పురుషుల సమర్పణకు ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా పురుషులు మహిళలకు తిరిగి బహుమతులు అందిస్తారు. దక్షిణ కొరియాలోనూ ఇదే సంప్రదాయం ఉంది, అయితే, ఏప్రిల్‌ 14న 'బ్లాక్‌ డే' పేరుతో మరో ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిన్లాండ్‌: వాలెంటైన్స్‌ డే స్నేహితుల దినోత్సవంగా గుర్తింపు పొందింది. ప్రేమికుల కన్నా స్నేహితులతో బహుమతుల్ని పంచుకోవడమే ఇక్కడి సంప్రదాయం.