Vitamin K: ఈ లక్షణాలు ఉంటే విటమిన్ 'కే' తక్కువున్నట్టే.. ఏమేం తినాలంటే
మానవ శరీరం ఆరోగ్యాన్ని ఉంచాలంటే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలను అందాల్సిందే. విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఈలతో పాటు విటమిన్ 'కే' కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో ఏదైనా విటమిన్ లోపం ఎదురైతే మొత్తం ఆరోగ్యం మీదే ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే పోషకాల్లో విటమిన్ 'కే' ప్రముఖ్యత సంతరించుకుంది. ఈ విటమిన్ లోపం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ముప్పు ఉంది. శరీరం చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు అవసరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో శరీరంలో పోషకాహారాలు లోపం ఉంటే వెంటనే గుర్తించి పోషకాలను, కావాల్సిన విటమిన్లను అందించడం చాలా ముఖ్యం.
ముక్కు నుంచి రక్తస్రావం విటమిన్ కె లోపం వల్లే
విటమిన్ కె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఇది ఎముకలు, గుండె మరియు మెదడు సజావుగా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. శరీరంలో కె విటమిన్ లోపం కారణంగా చిన్న గాయాలకు అధిక రక్తస్రావం లాంటివి ఎదురవుతుంటాయి. తరచుగా ముక్కు నుంచి రక్తస్రావం విటమిన్ కె లోపం వల్లే సంభవిస్తుంది. మరోవైపు ఎముక సాంద్రత తగ్గడం (Low Bone Density),బోలు ఎముకల వ్యాధికి కారణంగా నిలుస్తుంది. కీళ్లు, ఎముకలలో అడపాదడపా నొప్పికి కారణం విటమిన్ కే లోపంగా తెలుస్తుంది. ఇదే సమయంలో చిన్నగాయం పెద్దగాయంగా రూపాంతరం చెందుతుంది. గాయాలు త్వరగా మానాలంటే విటమిన్ కె అవసరం. దంతాలు, చిగుళ్ల రక్తస్రావం విటమిన్ కే లోపం లక్షణంగా నిపుణులు పేర్కొన్నారు.
ఆహారంలో కచ్చితంగా ఈ పదార్ధాలు ఉండాల్సిందే
విటమిన్ కే లోపించిన వారిలో గుండె, ఊపిరితిత్తుల సమస్య అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాస కోశ పనితీరు తగ్గిపోవటం వంటివి వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. విటమిన్ కే, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అవసరమని పరిశోధనలో తేలింది. ఇదే సమయంలో విటమిన్ K గుండె వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా విటమిన్ K లోపాన్ని అధిగమించాలంటే ఆహారంలో కచ్చితంగా ఈ పదార్ధాలు ఉండాల్సిందే. ఆకు కూరలు, ఆవాలు, పాలకూర, గోధుమ, బార్లీ, జ్యుసి ఫ్రూట్, గుడ్లు, మాంసం, ముల్లంగి, బీట్‌రూట, అరటిపండు, మొలకెత్తిన ధాన్యాలు, క్యాబేజీ, సోయాబీన్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి వాటిలో అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని స్వీకరిస్తే కే లోపం తొలగిపోతుంది.