Protein poisoning: ప్రోటిన్ పాయిజనింగ్ అంటే ఏమిటి.. ప్రోటీన్లు ఎక్కువైతే సమస్యలు తప్పవా..?
ఆరోగ్యంగా జీవించాలంటే ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. అయితే కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ లాగానే శరీరంలో ప్రొటిన్ శాతం పెరిగితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రొటిన్ ఎక్కువ అవ్వడం వల్ల జరిగే 'ప్రోటిన్ పాయిజనింగ్' గురించి చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ స్లిమ్ ఉండేందుకు వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. దీంతో ప్రోటిన్ ఫుడ్ కూడా తీసుకుంటారు. బరువు తగ్గే క్రమంలో ప్రోటిన్ ఫుడ్ పరిమితి దాటి తీసుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రోటీన్ ఫుడ్ తింటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. ఇందులోని న్యూట్రియంట్లు శరీర కణాల మరమ్మత్తుకు సాయపడతాయి. ప్రోటిన్లు పరిమితి దాటి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కల్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రొటిన్ బదులు ఫైబర్, ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచింది
శరీరంలో ప్రొటీన్ నిల్వ ఉండదు. కాబట్టి ఏ రోజు ప్రొటీన్ ఆ రోజే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తన బరువుని బట్టి కిలోకు 0.7 నుంచి 0.9 గ్రాముల ప్రొటిన్ తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఒక వ్యక్తి బరువు 65 కిలోలు అయితే రోజుకి సూమారు 45 నుంచి 60 గ్రాముల ప్రోటిన్ తీసుకోవాలి. ఒకవేళ ప్రోటిన్ ఎక్కువైతే అది ప్రొటిన్ పాయిజనింగ్‌కు దారి తీయొచ్చు. ఎక్కువ ప్రోటిన్ తీసుకుంటే మలబద్దకం సమస్య వస్తుంది. ముఖ్యంగా పొట్ట ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదమూ ఉంది. కావున ప్రొటీన్ విషయంలో జాగత్ర వహించాలి. ప్రొటిన్ ఆహారాలు తగ్గించి ఫైబర్, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచింది.