Dasara 2024: దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గమ్మకు ఏయే ఆభరణాలు అలంకరిస్తారంటే..
దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. శరన్నవరాత్రులలో దుర్గమ్మ తల్లిని దర్శించడం వల్ల జీవితం సమృద్ధిగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలు కూడా భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. భక్తులు సమర్పించిన ఆభరణాలతో పాటు సంప్రదాయంగా వస్తున్న వాటితో అమ్మవారిని అలంకరిస్తారు. ఏ అలంకారాలు ఉపయోగిస్తారో తెలుసుకోవాలన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంటుంది.
ఏ ఆభరణాలు వినియోగిస్తారంటే..
బాలాత్రిపుర సుందరీదేవి: అభయహస్తాలు, బంగారు పూలజడ, కంఠాభరణాలు, బంగారు వడ్డాణం. గాయత్రీదేవి: స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణాలు. అన్నపూర్ణాదేవి: స్వర్ణపాత్ర, బంగారు త్రిశూలం, హస్తాలు. లలితా త్రిపుర సుందరీదేవి: స్వర్ణ కిరీటం, కంఠాభరణాలు, స్వర్ణాభరణాలు, అభయహస్తాలు. మహాచండీదేవి: సింహ వాహనం, కంఠాభరణాలు, ఖడ్గం, కర్ణాభరణాలు, హస్తాలు. మహాలక్ష్మీదేవి: గజరాజు, అభయహస్తాలు, ధనరాశులు, వడ్డాణం, కంఠాభరణాలు, కర్ణాభరణాలు. సరస్వతీదేవి: బంగారు వీణ, స్వర్ణహస్తాలు, పగడాల హారం, వడ్డాణం. దుర్గాదేవి: శార్దూల వాహనం, బంగారు త్రిశూలం, సూర్యచంద్రులు, శంకుచక్రాలు. మహిషాసుర మర్ధినిదేవి: సింహవాహనం, బంగారు త్రిశూలం, స్వర్ణ ఖడ్గం, కంఠాభరణాలు, కర్ణాభరణాలు. రాజరాజేశ్వరిదేవి: స్వర్ణాభరణాలు, అభయహస్తాలు, చెరకుగడతో అలంకరిస్తారు. కాసులపేరు, బంగారు పూలజడ, దేవిపాదాలు అమ్మవారి రూపాన్ని అనుసరించి వాడతారు.