Mars: అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్.. గుర్తించిన చైనా రోవర్
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన జురాంగ్ రోవర్ పంపిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్‌ను గుర్తించారు.
1970లలో,అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకి చెందిన మెరైనర్-9 వ్యోమనౌక అందించిన చిత్రాల ద్వారా అంగారక గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని స్పష్టమైంది.
ఈ ఆవిష్కరణతో, అంగారకుడిపై జలధారలు ఎప్పుడైనా ఉన్నాయా? అనే అనుమానాలకు ముగింపు వచ్చింది.
అప్పటి నుంచి అంగారక గ్రహంపై నీటి ఉనికి గురించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.
అంగారకుడి నుంచి భూమిపై వచ్చి పడిన ఉల్కల్లో 450కోట్ల ఏళ్ల క్రితమే నీరు ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాదు, గత కొన్నేళ్లలో జరిగిన పరిశోధనల్లో అంతరిక్ష శిలల ఢీ వల్ల ఏర్పడ్డ బిలాల్లో,ఉపరితలం కింద ఐస్(మంచు)ఉందని తేలింది.
వివరాలు
చైనా, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి కొత్త పరిశోధనలు
కానీ, ఆ నీరు ఎప్పుడు ఉండేది? ఎంత పరిమాణంలో ఉండేది? ఎంతకాలం నిలిచి ఉండేది? అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలకు ఎప్పటికీ ఓ చిన్న్ని సవాల్‌గా మారాయి.
ముఖ్యంగా, అంగారకుడిపై గతంలో మహాసముద్రాలు ఉండేవా? అనే ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (CNSA) అంగారకుడిపైకి పంపిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా చైనా, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి కొత్త పరిశోధనలు చేశారు.
ఈ రోవర్, ఉతోపియా ప్లానీషియా అనే ప్రదేశంలో ఉపరితలం కింద ఉన్న శిలలను లోతుగా పరిశీలించింది.
వివరాలు
అంగారక గ్రహంపై గతంలో నీటి ప్రవాహం
ఈ పరిశోధనల్లో, ఆ ప్రదేశంలో ఒకప్పుడు మహాసాగరం ఉండేదని, దీని వల్ల తీర ప్రాంత అవక్షేపాలు (sediments) ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
వీటి ఆధారంగా అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల క్రితం బీచ్ ఉండేదని తేల్చారు.
ఈ కొత్త ఆవిష్కరణతో, అంగారక గ్రహంపై గతంలో నీటి ప్రవాహం, సముద్రాలు, తీర ప్రాంతాల ఉనికి అనే విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశాలు లభించాయి.