LOADING...
Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేయనున్న వ్యోమగామి శుక్లా
ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేయనున్న వ్యోమగామి శుక్లా

Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌లో 7 ప్రయోగాలు చేయనున్న వ్యోమగామి శుక్లా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)కు త్వరలో జరగబోయే యాత్రలో ముఖ్య వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రయాణం యాక్సియమ్ మిషన్-4(Ax-4)కార్యక్రమం కింద నిర్వహించనున్నారు. వచ్చే నెలలో శుక్లా ఐఎస్ఎస్‌కి చేరుకొని అక్కడ 14రోజుల పాటు ఉండనున్నారు. ఈసమయంలో ఆయన కనీసం ఏడు ప్రయోగాల్లో భాగస్వామ్యం కానున్నారని సమాచారం. ఈ ప్రయోగాల్లో అంతరిక్షంలో పంటల సాగుపై అధ్యయనంఅలాగే నీటి ఎలుగుబంటిగా పిలవబడే టార్డిగ్రేడ్ అనే సూక్ష్మజీవిపై పరిశోధన ప్రధానంగా ఉంటాయి. టార్డిగ్రేడ్‌లు ప్రపంచంలో అత్యంత అరుదైన సూక్ష్మ జీవుల్లో ఒకటి. సుమారు 600 మిలియన్ సంవత్సరాలుగా భూమిపై జీవిస్తూ వస్తున్న ఈ జీవులు 0.3 నుండి 0.5 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి.

వివరాలు 

డిఎన్‌ఎను ఇప్పటికే డీకోడ్ చేసిన ఇస్రో 

ఇవి తమలోని ప్రత్యేకమైన డిఎన్‌ఎ నిర్మాణం ద్వారా అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. ఈ టార్డిగ్రేడ్ జీవుల డిఎన్‌ఎను ఇస్రో ఇప్పటికే డీకోడ్ చేసింది. ఇప్పుడు వాటిపై అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ (microgravity) పరిస్థితుల్లో పునరుత్పత్తి ప్రక్రియలు ఎలా ఉంటాయో, అలాగే భూమిపై,అంతరిక్షంలో జన్యుమార్పిడులు (Gene mutations) ఎలా జరుగుతాయో విశ్లేషించనున్నారు. అంతరిక్ష వాతావరణంలో సూర్యకిరణాల తీవ్రత, గురుత్వాకర్షణ లేని స్థితుల్లో డిఎన్‌ఎ మార్పులను బట్టి భవిష్యత్తు వ్యోమగాముల కోసం రక్షణ విధానాలు అభివృద్ధి చేయాలన్నది ఈ పరిశోధనల ఉద్దేశం.

వివరాలు 

అంతరిక్షలో శుభాంశు శుక్లా మొత్తం ఏడు కీలకమైన పరిశోధనలు

ఈ పరిశోధనలు రాబోయే గగన్‌యాన్ మిషన్ వంటి మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ముఖ్య సమాచారం అందించగలవని ఇస్రో భావిస్తోంది. అంతేకాక, ఈ యాత్రలో అంతరిక్ష వాతావరణంలో కంప్యూటర్ స్క్రీన్‌లను ఉపయోగించడం వల్ల మానవ దృష్టి, ఒత్తిడి స్థాయిలపై పడే ప్రభావం గురించి కూడా అధ్యయనం చేయనున్నారు. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో గేజ్ ఫిక్సేషన్, కనుపాపల కదలిక వేగం వంటివి మానసిక ఒత్తిడిని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించనున్నారు. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్‌లో ఉపయోగించే అంతరిక్ష నౌకలలో కంప్యూటర్ల రూపకల్పనకు మార్గనిర్దేశం చేయనుంది. ఇలా, శుభాంశు శుక్లా మొత్తం ఏడు కీలకమైన పరిశోధనలు జరపనున్నారు. ఈ ప్రయోగాలన్నీ భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాల్లో మన దేశానికి మేలుకలిగించేలా ఉండనున్నాయి.