Space Junk: భూదిగువ కక్ష్యలో అంతరిక్ష వ్యర్థాల పెరుగుదలపై ఐరాస ఆందోళన
ఉపగ్రహ ప్రయోగాల గణనీయమైన వృద్ధితో భూదిగువ కక్ష్యం అంతరిక్ష వ్యర్థాలతో కిక్కిరిసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక ప్యానల్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భూదిగువ కక్ష్యలో 14,000 ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటిలో 3,500 నిరుపయోగమైనవి కాగా, ఉపగ్రహాల ప్రయోగాల ఫలితంగా ఏర్పడిన 12 కోట్ల రాకెట్ శకలాలు కూడా అక్కడ ఉన్నాయి. వీటిలో కొన్ని ట్రక్కు సైజులో ఉన్నట్లు అమెరికా సంస్థ స్లింగ్షాట్ ఏరోస్పేస్ గణాంకాలు వెల్లడించాయి.
అంతరిక్ష రద్దీ నియంత్రణ అవసరం
భూదిగువ కక్ష్యను జాగ్రత్తగా వినియోగించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంతరిక్ష రద్దీ సమన్వయంపై ఐరాస ప్యానల్ సూచించింది. ఈ ప్యానల్ సహ అధ్యక్షురాలిగా ఉన్న ఆర్తి హోల్లా మైని మాట్లాడుతూ, "ఇప్పటికే భూమి కక్ష్యలో అనేక పరికరాలు ఉండటంతో సమన్వయం తప్పనిసరి అయ్యింది. భూదిగువ కక్ష్యను సురక్షితంగా ఉంచడం ద్వారా కమ్యూనికేషన్, నేవిగేషన్ సేవలకు అంతరాయం రాకుండా చేయాల్సి ఉంది. ఉపగ్రహాలు ఢీకొనకుండా నిరోధించేందుకు సంబంధిత ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు సహకరించాల్సిందే," అని అన్నారు.
సమన్వయానికి అవరోధాలు
ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం కలిగిన దేశాలకు ఒకే తాత్విక విధానం లేకపోవడం సవాలుగా మారింది. కొన్ని దేశాలు తమ ఉపగ్రహాల డేటాను భద్రతా కారణాలతో పంచుకోడానికి నిరాకరిస్తుండగా, పౌర-సైనిక అవసరాలకు ఉపయోగించే ఉపగ్రహాల విషయంలో ఈ సమస్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వాణిజ్య సంస్థలు కూడా తమ రహస్య డేటాను పంచుకోవడంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రాకెట్ పేలుళ్ల సమస్యలు
ఇటీవల, చైనా రాకెట్ అంతరిక్షంలో పేలిపోవడం, రష్యా ఉపగ్రహం బద్దలవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల వేల శకలాలు ఏర్పడటంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. భవిష్యత్తు ముప్పు రానున్న సంవత్సరాల్లో మరెన్నో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రవేశించనున్నాయి. ఉపగ్రహాల పరస్పర ఢీకొనే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మాంట్రియాల్‌కు చెందిన నార్త్‌స్టార్ సంస్థ అంచనా ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ కారణంగా రూ.4 వేల కోట్ల నష్టాలు సంభవించవచ్చు.
ముందస్తు చర్యలు అవసరం
స్టార్‌లింక్ ఇప్పటికే వేల ఉపగ్రహాలను ప్రయోగించింది. నవంబర్ 27 నాటికి 540-570 కిలోమీటర్ల ఎత్తులో 6,764 ఉపగ్రహాలు ఉన్నాయి. 2024 తొలి భాగంలోనే 50,000 సార్లు ఢీకొనే ముప్పు నివారించడానికి మార్గదర్శనం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ, ప్రైవేట్ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, అంతరిక్ష రద్దీ నియంత్రణపై చర్యలు చేపట్టాలని ఐరాస ప్యానల్ సూచించింది.