
Shubhanshu: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి అన్‌డాకింగ్ విజయవంతం.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు మరికొద్ది గంటల్లో భూమిపైకి తిరిగి రానున్నారు. శుభాంశు బృందాన్ని తీసుకువస్తున్న 'డ్రాగన్' వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో అన్‌డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఈ వ్యోమనౌక పలు ప్రయోగాత్మక విన్యాసాలు చేసిన తరువాత భూవాతావరణంలోకి ప్రవేశించనుంది. దాదాపు 21 గంటల ప్రయాణం అనంతరం ఈ వ్యోమనౌక మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో ల్యాండింగ్ చేయనుంది. అనంతరం ఆ వ్యోమగాములను అక్కడి నుంచి క్వారంటైన్‌కు తరలించనున్నారు. దాదాపు ఒక వారం రోజుల పాటు వారు ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో ఉంటారు.
వివరాలు
ఖగోళంలో మానవ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
గత నెల 25న యాక్సియం-4 మిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. శుభాంశు శుక్లా బృందం ఆ రోజే నింగిలోకి ప్రయాణాన్ని ప్రారంభించింది. 28 గంటల ప్రయాణం అనంతరం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించారు. అక్కడ వారు దాదాపు 18 రోజులపాటు పలు ప్రయోగాలు నిర్వహించారు. ఆ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాముల బృందం తమ మానసిక ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసింది. ఖగోళంలో ఉన్న శూన్యాకర్షణ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే ప్రభావాన్ని శుభాంశు శుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు. అంతేకాక, ఖగోళంలో మానవ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై విద్యార్థుల కోసం ఓ వీడియోను రూపొందించారు.