Page Loader
ChatGPT: గూగుల్ సెర్చ్ కంటే 5.5 రెట్లు వేగంగా.. చాట్‌జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్‌.. 
గూగుల్ సెర్చ్ కంటే 5.5 రెట్లు వేగంగా.. చాట్‌జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్‌..

ChatGPT: గూగుల్ సెర్చ్ కంటే 5.5 రెట్లు వేగంగా.. చాట్‌జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే భారతీయులు దీన్ని అత్యధికంగా వినియోగించే యూజర్లుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ వాడకంలో 13.5 శాతం భాగస్వామ్యంతో భారత్‌ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అమెరికాను వెనక్కి నెట్టి ముందు వరుసలోకి దూసుకొచ్చింది. దేశంలో చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య 10.8 కోట్లకు పెరిగింది. ఇది చూస్తే ఏఐ టెక్నాలజీ మన దేశ ప్రజల జీవితాల్లో ఎలా జాగ్రత్తగా విలీనమైందో అర్థమవుతుంది. టెక్నాలజీ వినియోగంలో భారతీయులను కొట్టేవారే లేరని మళ్లీ రుజువైంది. చాట్‌జీపీటీ వినియోగంలో భారత్‌ మొదటి స్థానంలో నిలవగా,అమెరికా రెండో స్థానంలో ఉంది. అమెరికా వాటా 8.9 శాతమే కాగా,ఇండోనేషియా 5.7%,బ్రెజిల్‌ 5.4%,ఈజిప్ట్‌ 3.9%,మెక్సికో 3.5%,పాకిస్తాన్‌, జర్మనీ చెరో 3%,ఫ్రాన్స్‌ 2.9%, వియత్నాం 2.6 శాతం వాటాలతో తక్కువస్థాయిలో ఉన్నాయి.

వివరాలు 

డీప్‌సీక్‌ ఏఐ చాట్‌బాట్‌ వినియోగంలో.. భారతదేశం మూడో స్థానం

ఈ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ కేవలం టెక్‌ నిపుణులకు మాత్రమే కాదు, విద్యార్థులు, కంటెంట్‌ క్రియేటర్లు, సాధారణ వినియోగదారులు సైతం దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.హోంవర్క్‌ చేయడంలో సహాయం కావాలన్నా, సందేశాలు పంపించాల్సి వచ్చినా, సమాచారం తెలుసుకోవాల్సిన అవసరమైనా, కంటెంట్‌ తయారీలో సహకారం కావాల్సినా - చాట్‌జీపీటీ వినియోగం విస్తృతమవుతోంది. అమెరికన్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్‌ భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ఇంటర్నెట్‌ పరిశ్రమలో "క్వీన్‌"గా గుర్తింపు పొందిన వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మేరీ మీకర్‌ '2025 ఏఐ ట్రెండ్స్‌' రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా,చైనా అభివృద్ధి చేసిన డీప్‌సీక్‌ అనే మరో ఏఐ చాట్‌బాట్‌ వినియోగంలోనూ భారతదేశం మూడో స్థానంలో ఉంది.

వివరాలు 

భారతీయ భాషల్లోనూ సపోర్ట్‌ 

ప్రపంచవ్యాప్తంగా దీనిని వాడుతున్న వారిలో 6.9 శాతం భారతీయులే. చైనా 33.9 శాతం, రష్యా 9.2 శాతాలతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. డీప్‌సీక్‌ మొత్తం యూజర్ల సంఖ్య 5.4 కోట్లు. ఇంటర్నెట్‌ వినియోగం పెరగడం, శక్తివంతమైన టెక్నాలజీ రంగం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న డిజిటల్‌ మద్దతు, స్థానిక భాషలపై శ్రద్ధ వంటి అంశాలు ఈ వినియోగ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయి. చాట్‌జీపీటీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం లాంటి అనేక భాషల్లో సేవలు అందిస్తోంది. దీనివల్ల ఉపయోగదారులు తాము కోరిన సమాచారాన్ని స్వభాషలో పొందగలుగుతున్నారు. స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం, వేగవంతమైన ఇంటర్నెట్‌ లభ్యత కూడా దీనికి తోడైంది.

వివరాలు 

రోజుకి 100 కోట్ల సర్చ్‌లు! 

చాట్‌జీపీటీ ద్వారా రోజుకు 100 కోట్లకుపైగా శోధనలు జరుగుతున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. గూగుల్‌కు ఏడాదికి 36,500 కోట్ల సర్చ్‌ల మైలురాయిని చేరుకోడానికి 11 ఏళ్లు పట్టగా, చాట్‌జీపీటీ కేవలం రెండు సంవత్సరాల్లోనే అదే లక్ష్యాన్ని 5.5 రెట్లు వేగంగా అధిగమించింది. 2022 నవంబర్‌ 30న మొదలైన ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు దీన్ని వినోదం కోసం కాకుండా విద్య, రచనలు, కోడింగ్‌, కంటెంట్‌ తయారీ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇది దీని ప్రజాదరణకు ప్రధాన కారణం. చాట్‌జీపీటీకి ప్రస్తుతం నెలకు 80 కోట్ల యాక్టివ్‌ వినియోగదారులున్నారు. మొదటితో పోల్చితే యూజర్లు ఇప్పుడు దాని మీద మూడింతల సమయం వెచ్చిస్తున్నారు.

వివరాలు 

చెల్లించేందుకూ సిద్ధం.. 

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే - చాట్‌జీపీటీకి చెల్లించేందుకు సిద్ధపడిన వినియోగదారుల సంఖ్య 2 కోట్ల మార్క్‌ దాటి పోయింది. ఈ సంఖ్య సంవత్సరానికి 153 శాతం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. దీని వల్ల చాట్‌జీపీటీ సంస్థ అయిన ఓపెన్‌ఏఐకి భారీ ఆదాయం వచ్చేస్తోంది. ఒక్క ఏడాదిలోనే ఆదాయం పది రెట్లు పెరిగింది. చాట్‌జీపీటీ ద్వారా సంస్థకు ఏటా రూ.31,709 కోట్ల ఆదాయం వస్తోంది. మెరుగైన ఫీచర్ల కోసం యూజర్లు ఖర్చు చేయడంలో వెనుకాడడం లేదు.

వివరాలు 

డెస్క్‌టైమ్‌ అధ్యయనం ప్రకారం.. 

భారత్‌ ఈఏఐ వేదికల వినియోగంలో ముందు వరుసలో కొనసాగుతుందని 'డెస్క్‌టైమ్‌' అధ్యయనం చెబుతోంది. ఈ ధోరణి దేశంలో మరిన్ని ఏఐ స్టార్టప్‌లకు దారి తీసే అవకాశం ఉందని అంచనా. ఈ అధ్యయనం ప్రకారం, భారతదేశ కార్యాలయాల్లో 92.2 శాతం వరకు చాట్‌జీపీటీని రోజువారీ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఈ రేటు 72.2 శాతమే. అంటే వాడకంలో అమెరికాను మించిపోయిన ఘనత భారత్‌ సొంతం చేసుకుంది.