Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల వివరాలు లీక్
భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా ప్రొవైడర్ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, దాని కస్టమర్లపై ప్రభావం చూపే ఒక పెద్ద డేటా భద్రతా ఉల్లంఘనను ఎదుర్కొంటోంది. వెంచర్ క్యాపిటలిస్ట్ @Deedydas X ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒక హ్యాకర్ సుమారు 31 మిలియన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న భారీ డేటాసెట్‌ను 150,000 డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. లీక్ అయిన డేటాసెట్‌లో కస్టమర్ల అత్యంత సున్నితమైన వివరాలు ఉన్నాయి. ఇందులో పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, పాన్ కార్డు సమాచారం, కస్టమర్ జీతాలు వంటి వివరాలు ఉన్నాయి.
అధికారిక ప్రకటన ఇవ్వని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్
ఈ డేటా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO) అమర్జీత్ ఖనుజా నుంచి హ్యాకర్ పొందినట్లు పేర్కొన్నాడు. భారతదేశంలో ఏదీ ప్రైవేట్‌గా ఉండదని డీడీ ఎక్స్ పోస్ట్‌లో రాశాడు. ఈ డేటా లీక్ కారణంగా లక్షలాది మంది వ్యక్తులు గుర్తింపు దొంగతనం, ఆర్థిక మోసం, ఇతర దోపిడీలకు గురవుతారు. దీనివల్ల లక్ష్యంగా చేసుకున్న స్కామ్‌లు, ఆన్‌లైన్ ఖాతాల హ్యాకింగ్, ఫిషింగ్ దాడులు, ఖాతా టేకోవర్‌లు వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. డేటా విక్రయానికి సంబంధించి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.