ISRO Spadex Mission: డాకింగ్ టెస్ట్ వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా డాకింగ్ టెస్ట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న నిర్వహించాల్సిన డాకింగ్ ప్రక్రియను 9వ తేదీకి వాయిదా వేసింది.
అయితే వాయిదా వెనుక ఉన్న కారణాలను ఇస్రో ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు.
కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్ స్పాడెక్స్ మిషన్‌కు 'ఇండియన్ డాకింగ్ టెక్నాలజీ'గా నామకరణం చేశారు. ఈ మిషన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
ఇస్రో తొలిసారిగా ఈ తరహా డాకింగ్ టెస్ట్‌ను నిర్వహించనుంది.
Details
రష్యా, అమెరికా, చైనా వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ
స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా, భూమి దిగువ కక్ష్యలో రెండు ప్రత్యేక ఉపగ్రహాలను అనుసంధానం చేయడానికి ఇస్రో సిద్ధమవుతోంది.
ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది.
డాకింగ్ టెస్ట్ విజయవంతమైతే, ఇస్రో ఈ క్లిష్టమైన సాంకేతికతను సాధించిన నాలుగో దేశంగా నిలుస్తుంది.
ఈ ప్రక్రియలో గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో ప్రయాణించే రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను డాకింగ్ చేస్తారు.
సెన్సార్ సెట్ సాయంతో ఉపగ్రహాల వేగాన్ని తగ్గించి, ఆపై ఒకదానిని మరొకదితో అనుసంధానం చేస్తారు. ఇస్రో ఇప్పటికే ఈ భారతీయ డాకింగ్ మెకానిజంపై పేటెంట్ పొందింది.
Details
చంద్రునిపై నమూనాలు సేకరించేందుకు ప్రణాళికలు
డాకింగ్ టెక్నాలజీ సంక్లిష్టత కారణంగా, రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లను కచ్చితమైన కక్ష్యలో ఉంచడమే గాక, అవి ఢీకొట్టకుండా చూసుకోవడం కీలకం.
డిసెంబర్ 30న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ సీ-60 వాహక నౌక ద్వారా స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా ఎస్‌డీఎక్స్01 (చేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) అనే 440 కిలోల బరువు గల రెండు ఉపగ్రహాలను 470 కిలోమీటర్ల ఎత్తులో భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఈ ఉపగ్రహాలను 3 మీటర్ల దూరానికి చేరుస్తూ డాకింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఈ మిషన్ ద్వారా ఇస్రో చంద్రయాన్-4 మిషన్ కోసం డాకింగ్ టెక్నాలజీ నైపుణ్యం సాధించేందుకు సిద్ధమవుతోంది.
ఈ మిషన్ ద్వారా చంద్రునిపై నమూనాలను సేకరించనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.