
Google: చైనా,రష్యాకు సంబంధించిన దాదాపు 11,000 యూట్యూబ్ ఛానెల్స్ ను తొలగించిన గూగుల్..కారణం ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
వివిధ దేశాలకు సంబంధించిన అసత్యమైన ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ (Google) సుమారు 11,000 యూట్యూబ్ (YouTube) ఛానళ్లను తొలగించినట్టు వెల్లడించింది. ఇందులో చైనా, రష్యా దేశాలకు చెందిన ఛానల్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. తొలగించిన ఛానళ్లలో 7,700 యూట్యూబ్ ఛానళ్లు చైనా దేశానికే చెందినవని పేర్కొంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి అనుకూలంగా భారత్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ వివిధ వీడియోలు ప్రచురించినట్లు గూగుల్ తెలిపింది.
వివరాలు
రష్యా ప్రభుత్వ ఆధీనంలోని బ్లాగు తొలగింపు
ఇక రష్యాకు సంబంధించిన 2,000కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర వెబ్‌సైట్లను తొలగించామని గూగుల్ తెలిపింది. రష్యాకు మద్దతుగా మిడియా ప్రచారాలు,ఉక్రెయిన్, నాటో దేశాలను విమర్శించినట్లు గుర్తించినట్లు తెలిపింది. రష్యాలోని పలు సంస్థలకు ఈ ఛానళ్లతో సంబంధాలు ఉన్నట్లు గూగుల్ వివరించింది. ఇటీవలే 20 యూట్యూబ్ ఛానళ్లతో పాటు, నాలుగు ఖాతాలు, రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ఒక మీడియా సంస్థకు చెందిన బ్లాగును కూడా తొలగించినట్టు గూగుల్ తెలిపింది.
వివరాలు
పలు దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్ల తొలగింపు
చైనా, రష్యాలతో పాటు, ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్‌బైజాన్, ఘనా దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను కూడా తొలగించినట్టు గూగుల్ వివరించింది. ఈ ఛానల్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసత్యమైన వార్తలు ప్రచారం చేస్తున్న కారణంగా చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. 2025 మొదటి త్రైమాసికంలోనే గూగుల్ 23,000కు పైగా ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో మెటా సంస్థ సుమారు 10 మిలియన్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు ప్రకటించింది.