అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA)చే నిర్వహించబడుతున్న హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ C/2022 E3 (ZTF) అనే తోకచుక్క చిత్రాన్ని బంధించింది. 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క ప్రత్యక్షం అయింది. ఇది ప్రస్తుతం అంతర్గత సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది. ఫిబ్రవరి 1 న 42 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి దగ్గరగా వస్తుంది. సౌర వ్యవస్థ అవశేషాలుగా పిలిచే తోకచుక్కలు ఎప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. భారతదేశంలో IIA నుండి ఖగోళ శాస్త్రవేత్తలు హిమాలయన్ చంద్ర టెలిస్కోప్‌ని ఉపయోగించి C/2022 E3 ZTF చిత్రాన్ని తీశారు. లడఖ్‌లోని హన్లే వద్ద ఉన్న ఇది సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో భారతదేశంలోనే ఎత్తైన టెలిస్కోప్.
మొదట దీనిని గ్రహశకలం అని అనుకున్నారు
ఖగోళ శాస్త్రవేత్తలు మార్గరీట సఫోనోవా, ముల్చంద్ కుర్రే, భరత్ చంద్ర ఈ తోకచుక్క చిత్రాలను ఎరుపు, ఆకుపచ్చ, నీలం ఫిల్టర్‌లలో తీశారు. C/2022 E3 ZTF మొదట ఒక గ్రహశకలం అనుకున్నా, పరిశీలనల తర్వాత అది తోకచుక్క అని నిర్ధారించారు. జనవరి 12 న, తోకచుక్క సూర్యుడికి 160 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తర అర్ధగోళం నుండి తెల్లవారుజామున సమయంలో తోకచుక్క బాగా కనిపిస్తుంది. వాయువ్య దిశలో దృష్టి కేంద్రీకరించి ఆకాశంలో మసకబారిన, ఆకుపచ్చని మరక లాంటి వస్తువు ఏమైనా కనపడితే అదే ఈ తోకచుక్క. మెరుగ్గా కనిపించాలంటే బైనాక్యులర్‌లు లేదా టెలిస్కోప్‌ని ఉపయోగించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు.