Page Loader
IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం
IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం

IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో కంప్యూటింగ్ సామర్థ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశీయంగా 34,000 GPUల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో, ఫౌండేషన్ మోడళ్ల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు పడింది. ఈ నేపథ్యంలో స్వదేశీ AI మిషన్‌ భాగంగా, దేశీయంగా అభివృద్ధి చేయబోయే ఫౌండేషన్ మోడల్స్ నిర్మాణానికి ముగ్గురు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 'IndiaAI - Make AI in India, Make AI work for India' అనే న్యూఢిల్లీ సమావేశంలో ఆయన కీలక ప్రకటనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, IndiaAI మిషన్‌కు ఎంపికైన జట్లు తమతమ రంగాల్లో గ్లోబల్ టాప్ 5లో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

Details

టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ చేరాలి

ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రజాస్వామికరణపై చూపిన దార్శనికతకు అనుగుణంగా, టెక్నాలజీ ప్రయోజనాలను కొద్దిమందికి పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరికి చేరవేయాలన్నదే మిషన్ ఉద్దేశమని తెలిపారు. సమాజంలో ప్రతిభను పెంపొందించేందుకు, కొత్త పరిష్కారాలను అందించేందుకు, అవకాశాలను మెరుగుపర్చేందుకు టెక్నాలజీని ప్రజలకు అందించాలన్నారు. IndiaAI మిషన్‌ అమలులో ప్రతీ అంశంలో గణనీయ పురోగతిని సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మిషన్‌ దేశంలో సమగ్రమైన AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 367 డేటాసెట్‌లను AI ఫండ్‌లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు. కామన్ కంప్యూట్ వనరులు టెక్నాలజీ ప్రజాస్వామికరణకు మూలస్తంభమని పేర్కొన్నారు.

Details

అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రణాళిక

IndiaAI మిషన్‌ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌ను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాల నమూనాలు, కంప్యూటింగ్ వనరులు, భద్రత ప్రమాణాలు, ప్రతిభ అభివృద్ధి వంటి అంశాలతో కూడిన సమగ్ర AI పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి కృషి చేస్తోంది. స్వదేశీ డేటాపై శిక్షణ పొందిన AI మోడల్స్ అభివృద్ధి చేయడం, ప్రపంచ స్థాయిలో ప్రాసెస్ చేయగల పరిష్కారాలను అందించడమే మిషన్ ఉద్దేశమని తెలిపారు. IndiaAI భాగస్వామ్యంతో స్టేషన్ F, HEC పారిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసే ఈ ప్రణాళిక భారత ఆవిష్కరణ దౌత్యానికి ఒక కొత్త దశగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. భారత్‌కి చెందిన ఉత్తమ స్టార్టప్‌లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ మిషన్ పనిచేస్తోందని చెప్పారు.

Details

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది

ఇక మరోవైపు, దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగిందని గణాంక మంత్రిత్వ శాఖ తాజా సర్వే వెల్లడించింది. దేశంలో 85.5 శాతం కుటుంబాలకు కనీసం ఒక స్మార్ట్‌ఫోన్ ఉందని తెలిపింది. 15-29 ఏళ్ల గ్రామీణ యువతలో 96.8 శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారా కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడకం వంటి కార్యకలాపాలు చేశారని పేర్కొంది. పట్టణాల్లో ఈ శాతం 97.6గా నమోదైంది. 34,950 కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించగా, ఇందులో 19,071 గ్రామీణ, 15,879 పట్టణ కుటుంబాలు ఉన్నట్లు వెల్లడించారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని కొద్దిపాటి ప్రాంతాలు తప్ప ఈ సర్వే దేశవ్యాప్తంగా నిర్వహించబడినట్టు అధికారులు తెలిపారు.