City Killer Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం 'సిటీ కిల్లర్' ..రిస్క్ కారిడార్‌లో 7 ప్రధాన నగరాలు
ఈ వార్తాకథనం ఏంటి
నాసా తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, 2024 YR4 అనే గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది.
ఇది చూడటానికి చిన్నదిగా కనిపించినప్పటికీ, దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని నాసా స్పష్టం చేసింది.
2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని, ముఖ్యంగా ఐదు నగరాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు.
ఈ ప్రదేశాల్లో భారతదేశానికి చెందిన కోల్‌కతా, ముంబై కూడా ఉండడం గమనార్హం.
ఈ గ్రహశకలం ఏ నగరంపై పడితే, ఆ ప్రాంతం పూర్తిగా నాశనమైపోతుందని, అందువల్లే దీనికి "సిటీ కిల్లర్" అనే పేరు పెట్టారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వివరాలు
భూమిపై ఢీకొట్టే అవకాశాలు పెరుగుతున్నాయా?
నాసా పరిశీలనల ప్రకారం, 2024 YR4 గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 3.1శాతానికి పెరిగింది.
మొదట ఇది 2.6 శాతంగా ఉండగా,2024 జనవరి నాటికి ఇది 1శాతానికి తగ్గింది.
అయితే ఒక్క ఏడాదిలోనే 3.1శాతానికి పెరగడంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఈ మార్పును నిశితంగా పరిశీలిస్తూ, భూమిపై దాని ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.
వాయు విస్ఫోటనంగా మారే ప్రమాదం
2024 YR4 గ్రహశకలం 40 నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది భూమిని తాకినట్లయితే,వాయు విస్ఫోటనంగా మారే ప్రమాదం ఉంది.
దీని ప్రభావంతో పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచం మొత్తం నాశనం కాకపోయినా,ఒక పెద్ద నగరం పూర్తిగా కాలి బూడిద కావచ్చు.
వివరాలు
2032 డిసెంబర్ 22 - అతి కీలకమైన రోజు
నాసా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, 2032 డిసెంబర్ 22న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది.
ముఖ్యంగా తూర్పు పసిఫిక్, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియా ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
అత్యంత ప్రమాదకరమైన నగరాలు
ఈ గ్రహశకలం ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగోటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్టూమ్ వంటి నగరాలపై పడితే, లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నగరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.