ISRO: రేపు ఉదయం 11. 50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్
ఆపరేషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ భారీ మిషన్ సన్నద్ధమైంది. రేపు ఉదయం 11.30 గంటలకు శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ను నింగిలోకి పంపనున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరు పేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ ఎల్వీ-సీ57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలను చేశారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నారు.
అక్టోబర్ లో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం
భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు-1(ఎల్-1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1470 కిలోల బరువున్న ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టునున్నారు. చంద్రయాన్-3 కి సంబంధించిన లాండర్ రోవర్ లు చంద్రునిపై విజయవంతంగా పనిచేస్తున్నాయని, అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. జీఎస్ఎల్‌వీ-మార్క్-2 ద్వారా INSAT-3DS రాకెట్ ప్రయోగం చేసి, తదుపరి మాసంలో ఎస్ఎస్ఎల్-వి ప్రయోగం చేపడతామని ఆయన వివరించారు.