ISRO: రాబోయే మిషన్‌లో మనుష్యులను చంద్రునిపైకి పంపడం,వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై యోచన: సోమనాథ్
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-4,చంద్రయాన్-5 ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది. ఈరోజు (ఆగస్టు 23) మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఇస్రో రాబోయే మిషన్లు (చంద్రయాన్ -4,చంద్రయాన్ -5) చంద్రునిపైకి మానవులను పంపడమే,కాకుండా వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
చంద్రయాన్-3 నుంచి అందిన డేటా ఇదే
చంద్రయాన్-3 ఆగస్ట్ 23, 2023న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 మిషన్ కింద 5 ప్రయోగాలు జరిగాయని, వాటి నుంచి ముఖ్యమైన డేటా లభించిందని సోమనాథ్ ఈరోజు చెప్పారు. చంద్రయాన్-3 నుంచి ఈరోజు మనకు 55జీబీ డేటా లభించిందని ఆయన చెప్పారు. డేటాను సమీక్షించామని, విశ్లేషించామని, త్వరలో బహిరంగపరుస్తామని ఇస్రో చీఫ్ చెప్పారు. ఇతర శాస్త్రవేత్తలు కూడా ఈ డేటాను విశ్లేషించగలరు.
ఇస్రో చీఫ్ ఏం చెప్పారు?
తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 ప్రయాణం కొనసాగుతుందని.. చంద్రయాన్-4 నమూనా సిద్ధమైందని.. చంద్రుడిని ఎలా చేరుకోవాలో నిరూపించామని.. అక్కడ నుండి ఎలా తిరిగి రావాలో కూడా నిరూపించాలని అన్నారు. "మనుష్యులను చంద్రునిపైకి పంపడం, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై మాకు అదనపు దృక్పథం ఉన్నందున తదుపరి దశ తీసుకోవడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.