
Nasa: సౌర వ్యవస్థలోకి తరలివచ్చిన కొత్త ఇంటర్స్టెల్లార్ తోకచుక్కను కనుగొన్న నాసా
ఈ వార్తాకథనం ఏంటి
భూమి వైపు విశ్వం నుంచి గగనశకలాలు అప్పుడప్పుడూ అతిథుల్లా వస్తూ తమ ఆనంద సందేశాన్ని ప్రకటిస్తుంటాయి. అయితే అవి భూకక్ష్యలోకి ప్రవేశించగానే, వేగవంతంగా వచ్చిన కారణంగా, వాతావరణంలో మండిపడి మసిగా మారిపోతుంటాయి. కానీ, దీప్తిమంతంగా మెరుస్తూ తన ప్రత్యేకమైన తోకను కలిగిన తోకచుక్క మాత్రం ఈ నియమానికి అతీతం. ఆకాశంలో కనిపించే స్వల్ప సమయంలోనే అలరారిస్తూ, మన కళ్లకు కనువిందుగా మారుతుంది.
వివరాలు
సౌరవ్యవస్థకు వెలుపల నుండి వచ్చిన మూడవ కొత్త తోకచుక్క
ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఒక తోకచుక్క తాజాగా మన సౌరమండలంలోకి ప్రవేశించిందని నాసా శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీనికి 3ఐ/అట్లాస్ అనే పేరు పెట్టారు. ఇది ఇప్పటివరకు సౌరవ్యవస్థకు వెలుపల నుండి వచ్చిన మూడవ కొత్త తోకచుక్కగా ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. చిలీ దేశంలోని రియో హర్టాడో పట్టణంలో ఉన్న ఆస్ట్రరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ అరైవల్ సిస్టమ్ (అట్లాస్) పేరుతో నిర్వహిస్తున్న సర్వే టెలిస్కోప్, అమెరికాలోని శాన్ డీగో కౌంటీలో ఉన్న పాలమార్ అబ్జర్వేటరీలోని జ్వికీ టెలిస్కోప్ జూలై 1వ తేదీన ఈ తోకచుక్కను గుర్తించాయి. ఈ తోకచుక్క,"ధనస్సు రాశి"గా పిలువబడే నక్షత్ర సమూహం వైపు నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
భూమికి ఎటువంటి ప్రమాదం లేదని నిపుణుల నిర్ధారణ
ఇది ప్రస్తుతం భూమికి సుమారు 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా వారు తెలిపారు. ఈ తోకచుక్క భూమికి చాలా దూరంలో ప్రయాణిస్తున్నందున, ఇది మన గ్రహానికి ఎటువంటి హానికర ప్రభావం చూపే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది సూర్యునికి కూడా 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్టోబర్ 30న ఈ తోకచుక్క సూర్యునికి అత్యంత సమీపంగా వెళ్లనుంది. ఆ సమయంలో ఇది సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరం వరకు చేరుతుంది. అంటే, అంగారకుడి కంటే కూడా సూర్యునికి ఇది మరింత దగ్గరగా వెళ్తుంది.
వివరాలు
డిసెంబర్ తరువాత మళ్లీ..
ఈ తోకచుక్కను సెప్టెంబర్ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు టెలిస్కోప్ సహాయంతో వీక్షించవచ్చు. అనంతరం ఇది సూర్యుని ఆవలి వైపుగా వెళ్లిపోతుంది. దాంతో, భూమి మీదినుంచి దానిని మరింత కాలం తేలికగా చూడడం సాధ్యపడకపోవచ్చు. అయితే డిసెంబర్ తరువాత ఇది మళ్లీ కనువిందుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
గతంలో వచ్చిన ఇతర అంతర్జాతీయ తోకచుక్కల జ్ఞాపకాలు
2017లో 1ఐ/ఓమువామూ, 2019లో 2ఐ/బొరిసోవ్ వంటి తోకచుక్కలు కూడా అంతరించిపోయే ముందు మన సౌరమండలంలోకి ప్రవేశించి విశేషంగా శాస్త్రజ్ఞులకు కొత్త సమాచారాన్ని అందించాయి. ఇప్పుడు వచ్చిన 3ఐ/అట్లాస్ కూడా అంతే విధంగా ఖగోళ శాస్త్రానికి మరింత విశదీకరణను అందించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ కొత్త తోకచుక్కకు సంబంధించిన తోక పొడవు, వెడల్పు వంటి వివరాలు పూర్తిగా అందుబాటులో లేవు. అయితే దీనిని మరో పేరుగా సీ/2025 ఎన్1 అనే విధంగా కూడా పిలుస్తున్నారు.