Page Loader
NISAR Mission: నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే..
నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

NISAR Mission: నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా..? ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తుందంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ సాయంత్రం, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 రాకెట్‌ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి నిసార్ ఉపగ్రహాన్ని జూన్‌లోనే ప్రయోగించాల్సి ఉండగా, పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ విఫలమైన నేపథ్యంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు.

వివరాలు 

నిసార్ ఉపగ్రహానికి డ్యూయెల్ రాడార్ సిస్టమ్‌ 

నిసార్ ఉపగ్రహానికి డ్యూయెల్ రాడార్ సిస్టమ్‌ ఉంది. ఇందులో ఎస్-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్‌ను ఇస్రో అభివృద్ధి చేయగా,ఎల్-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్‌ను నాసా రూపొందించింది. ఈ రెండు రాడార్లు కలసి 12 మీటర్ల వ్యాసం కలిగిన రిఫ్లెక్టర్ యాంటెన్నాను కలిగి ఉంటాయి. సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాంకేతికత వల్ల మేఘాలను దాటి కూడా భూమిపై జరిగే కదలికలను సెంటీమీటర్ స్థాయిలో గుర్తించగలదు. ఇక, ఈ ప్రయోగంలో నాసా అందించిన ఇతర ముఖ్యమైన పరికరాల్లో ఇంజినీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్, హై-రేట్ స్పైన్స్ డౌన్‌లింక్ వ్యవస్థ, జీపీఎస్ రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లు ఉన్నాయి.

వివరాలు 

 ఉచితంగా అందుబాటులో.. శాటిలైట్ నుంచి వచ్చే డేటా 

నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తూ,అన్ని రకాల కదలికలు లేదా మార్పులను క్రమంగా గుర్తించి పర్యవేక్షించగలదు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్‌లో అభివృద్ధి చేశారు. భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ ఉపగ్రహం సేకరించనుంది. నిసార్ శాటిలైట్ నుంచి వచ్చే డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ డేటా సురక్షితంగా ఉండేందుకు నాసా దాన్ని క్లౌడ్‌లో భద్రపరచనుంది. సుమారు 2,800 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం ప్రపంచంలోనే తొలి డ్యూయెల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో భూమిని పరిశీలించగల శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఆధునిక రాడార్ ఇమేజింగ్ సాంకేతికతతో నిసార్ భూ ఉపరితలాన్ని అంతరిక్షం నుంచి అత్యంత స్పష్టంగా పరిశీలించగలదు.

వివరాలు 

నిసార్ ఉపగ్రహ ప్రయోజనాలు: 

సరళంగా చెప్పాలంటే.. నిసార్ ఉపగ్రహం ఆకాశం నుంచి భూమిపై కదలికలను సెంటీమీటర్ స్థాయిలో గుర్తించి, వాటిని 3డీ రూపంలో చూపగలదు. నిసార్ ఉపగ్రహం పంపించే హై రిజల్యూషన్ డేటా ద్వారా భారత తీరప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. సముద్రంపై ఉన్న మంచు కదలికలను గమనించవచ్చు. అంటార్కిటికా పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల లక్షణాలను, పరిస్థితులను పర్యవేక్షించవచ్చు.

వివరాలు 

నిసార్ ఉపగ్రహ ప్రయోజనాలు: 

పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవవైవిధ్యం, భూగర్భ జలాల పరిస్థితి, సముద్ర మట్టం పెరుగుదల వంటి అంశాలతో పాటు భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను నిరంతరం ట్రాక్ చేయవచ్చు. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించి, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు నిసార్ మిషన్ మద్దతు ఇస్తుంది.