
Nasa: 2030 నాటికి చంద్రునిపై అణు రియాక్టర్ నిర్మించనున్న నాసా
ఈ వార్తాకథనం ఏంటి
అంగారక యాత్రలు, అంతరిక్ష పరిశోధనలలో వేగం పెంచేందుకు నాసా సిద్ధమవుతోంది. ఇటీవల NASA తాత్కాలిక యాజమాన్య బాధ్యతలు చేపట్టిన షాన్ డఫీ, చంద్రుడిపై ఏర్పాటు చేయాల్సిన అణు విద్యుత్ కేంద్రం ప్రాజెక్టును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంతేకాదు, 2030 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) రిటైర్ చేసే నేపధ్యంలో దాని స్థానంలో కొత్త స్పేస్ స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేసే విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదనలు NASA లోపల పంపిన కొన్ని డైరెక్టివ్‌ల రూపంలో బ్లూమ్‌బర్గ్‌కి లభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన తరువాత, డఫీ చేపట్టిన తొలి ప్రధాన విధాన మార్పులుగా ఇవి భావిస్తున్నారు.
వివరాలు
2030 లోపే ప్రయోగానికి సిద్ధం
డఫీ ఇచ్చిన మొదటి డైరెక్టివ్ ప్రకారం, చంద్రుడిపై విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమయ్యే అణు రియాక్టర్ డిజైన్‌ను త్వరగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే NASA కొన్ని ప్రైవేట్ కంపెనీలకు చిన్న పరిమాణంలోని అణు రియాక్టర్‌ల రూపకల్పన కోసం కాంట్రాక్టులు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అధిక శక్తి సామర్థ్యం గల రియాక్టర్ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీని 2030 లోపే ప్రయోగానికి సిద్ధంగా ఉంచాలనే ఆలోచన ఉంది. రెండవ డైరెక్టివ్ ప్రకారం,ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 తర్వాత స్థానంలోకి వచ్చే కొత్త స్పేస్ స్టేషన్ల అభివృద్ధికి సంబంధించి NASA ప్రైవేట్ రంగంతో చేసే ఒప్పంద విధానాన్ని మారుస్తోంది.
వివరాలు
రెండు దేశాల అంతరిక్ష చీఫ్‌లు సమావేశం
భవిష్యత్తులో NASAకి వచ్చే నిధుల పరిమితి మారవచ్చు అనే భావనతో, మరింత సౌలభ్యంగా ఒప్పందాల రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఈ మార్పు తీసుకొచ్చారు. ఈ చర్యలన్నీ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ దిమిత్రి బకానోవ్‌తో డఫీ సమావేశమైన కొన్ని రోజుల తర్వాత జరగడం గమనార్హం. 2018 తర్వాత రెండు దేశాల అంతరిక్ష చీఫ్‌లు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో చంద్రుని ఉమ్మడి పరిశోధనలు, అలాగే ప్రస్తుతం రెండూ ఉపయోగిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భవితవ్యంపై చర్చ జరిగినట్లు రోస్కోస్మోస్ ప్రకటన వెల్లడించింది.