NASA's SpaceX Crew-12 mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములు: నాసా-స్పేస్-ఎక్స్ క్రూ-12 మిషన్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
నాసా చేపడుతున్న స్పేస్-X క్రూ-12 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కు నలుగురు వ్యోమగాములను పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇది 12వ సిబ్బంది మార్పిడి ప్రయాణం కావడం విశేషం. అమెరికాయూరప్,రష్యా దేశాలకు చెందిన ఈ వ్యోమగాములు సుమారు ఎనిమిది నెలలపాటు అంతరిక్షంలో నివసిస్తూ శాస్త్రీయ పరిశోధనలు,సాంకేతిక పరీక్షలు,అంతరిక్ష కేంద్ర నిర్వహణ పనులు చేపడతారు. ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌పై ప్రయోగించే 'ఫ్రీడమ్'అనే డ్రాగన్ అంతరిక్ష నౌకలో వీరు ప్రయాణించనున్నారు. ఈమిషన్‌లో నాసా వ్యోమగామి జెస్సికా మీర్ కమాండర్‌గా,జాక్ హాథవే పైలట్‌గా వ్యవహరిస్తుండగా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీ అడెనోట్,రష్యా రోస్కోస్మోస్‌కు చెందిన ఆండ్రే ఫెడ్యాయేవ్ మిషన్ స్పెషలిస్టులుగా పాల్గొంటున్నారు.
వివరాలు
దీర్ఘకాల మానవ అంతరిక్ష ప్రయాణాలకు ఐఎస్ఎస్ కీలకం
అంతరిక్షంలో వీరు ఆరోగ్యం,మొక్కల పెరుగుదల,కొత్త అంతరిక్ష సాంకేతికతలపై ప్రయోగాలు చేయనున్నారు. న్యుమోనియా బ్యాక్టీరియాపై అధ్యయనాలు, శూన్య గురుత్వాకర్షణలో రక్తప్రసరణపై పరిశోధనలు, అవసరమైనప్పుడు అంతరిక్షంలోనే ఇంజెక్షన్ ద్రవాలు తయారు చేసే పరీక్షలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్ మిషన్లకు ఉపయోగపడేలా ఆహార ఉత్పత్తి పెంచే పరిశోధనలు సాగిస్తారు. ప్రయోగం అనంతరం గంటకు దాదాపు 17,500 మైళ్ల వేగంతో డ్రాగన్ నౌక ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్‌కు ఆటోమేటిక్‌గా డాక్ అవుతుంది. దీర్ఘకాల మానవ అంతరిక్ష ప్రయాణాలకు ఐఎస్ఎస్ కీలకంగా ఉందని నాసా చెబుతోంది. క్రూ-12 వంటి మిషన్ల ద్వారా వచ్చిన అనుభవమే భవిష్యత్తులో ఆర్టెమిస్ కార్యక్రమం ద్వారా చంద్రుడిపై మళ్లీ మనుషులను పంపడం, ఆపై మార్స్‌కు వెళ్లే దిశగా నాసాకు దోహదపడనుంది.