
Sergey Brin: రూ.6000 కోట్ల ఆస్తులను విరాళంగా ఇచ్చిన గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత ధనికులు తమ సంపదలో భాగాన్ని మానవహిత ప్రయోజనాల కోసం వెచ్చిస్తూ దానశీలతను చాటుకుంటున్నారు.
కార్పొరేట్ రంగంలో ఉన్న అగ్రగాములు వివిధ సందర్భాల్లో విరాళాలు ఇస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
తాజాగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భారీ విరాళం ఇచ్చారు.
సుమారు 700 మిలియన్ డాలర్ల విలువైన ఆల్ఫాబెట్ కంపెనీ షేర్లను ఆయన విరాళంగా ఇచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
భారత రూపాయల ప్రకారం చూస్తే, ఇది దాదాపు రూ.6,000 కోట్ల విలువ.
వివరాలు
ఈ విరాళాలు ఎవరికిచ్చారంటే...
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, బ్రిన్ ఇచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం కాటలిస్ట్4 అనే సంస్థకు వెళ్లింది.
ఈ సంస్థ లాభాపేక్షలేని పద్ధతిలో నాడీ సంబంధిత వ్యాధులు,వాతావరణ మార్పులపై పరిశోధనలు నిర్వహించేందుకు పనిచేస్తుంది.
గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ సంస్థను స్వయంగా బ్రిన్‌నే స్థాపించారు.
అతని కుటుంబ ఫౌండేషన్‌కు 5.8 లక్షల ఆల్ఫాబెట్ షేర్లను కేటాయించగా, పార్కిన్సన్ వ్యాధిపై పరిశోధనలు చేపడుతున్న మైఖేల్ జె. ఫాక్స్ ఫౌండేషన్‌కు మరో 2.82 లక్షల షేర్లను అందించారు.
మొత్తంగా 4.1 మిలియన్ ఆల్ఫాబెట్ షేర్లను బ్రిన్ విరాళంగా ఇచ్చినట్లు గతంలో రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో వెల్లడైంది.
అయితే అప్పట్లో ఈ షేర్లను పొందిన వ్యక్తులు లేదా సంస్థలు ఎవరు అన్నది తెలియలేదు.
వివరాలు
ఇదే తొలిసారి కాదు...
సెర్గీ బ్రిన్ భారీ విరాళాలు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. 2023లో గూగుల్ నుంచి ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ ప్రారంభించబడిన సందర్భంలో ఆయన 600 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
అనంతరం 2024లో మరోసారి 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని అందించారు.
బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం, 2004లో గూగుల్ పబ్లిక్‌గా (IPO) మారినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన 11 బిలియన్ డాలర్లకు మించి విలువైన షేర్లను అమ్మారు.
వివరాలు
విరాళాలిచ్చినా సంపదలో ఎటువంటి లోటు లేదు...
2019లో సెర్గీ బ్రిన్ ఆల్ఫాబెట్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, కంపెనీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
రష్యాలో జన్మించిన బ్రిన్, చిన్నవయసులోనే సెమిటిక్ వ్యతిరేకత వల్ల తన కుటుంబంతో పాటు అమెరికాకి వలస వెళ్లారు.
1998లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ల్యారీ పేజ్‌తో కలిసి గూగుల్‌ను స్థాపించారు.
అప్పటి నుంచి ఆయన ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో స్థిరమైన స్థానం సంపాదించారు.
ఇంత భారీ విరాళాలు ఇచ్చినా కూడా 51 ఏళ్ల బ్రిన్ సంపద 134 బిలియన్ డాలర్లుగా ఉంది.
భారత కరెన్సీలో ఇది సుమారు రూ.11.52 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 8వ స్థానంలో ఉన్నారు.