LOADING...
NISAR: నైసార్‌ శాటిలైట్‌ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!
నైసార్‌ శాటిలైట్‌ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!

NISAR: నైసార్‌ శాటిలైట్‌ కీలక దశలోకి.. పరికరాల పనితీరుపై ప్రారంభమైన పరీక్షలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్‌ ఉపగ్రహం (NISAR - NASA-ISRO Synthetic Aperture Radar) ఇప్పుడు అత్యంత కీలకమైన సన్నద్ధత దశలోకి ప్రవేశించింది. ఉపగ్రహ ప్రయోగం అనంతరం, దానిలోని పరికరాలు, వ్యవస్థల పనితీరును విశ్లేషిస్తూ 90 రోజుల పాటు ఈ సన్నద్ధత దశ కొనసాగనుంది. ఈ దశలో రాడార్ వ్యవస్థల పనితీరు, కక్ష్య గమన మార్పులు, ఉపగ్రహ స్థిరీకరణ వంటి అంశాలను పరిశీలిస్తారు. పూర్తిస్థాయి భూమి పరిశీలనకు నైసార్‌ను సిద్ధం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

Details

737 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశం

జూలై 30న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్ ద్వారా నైసార్‌ను నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ప్రయోగ అనంతరం ఇది 737 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరింది. భవిష్యత్తులో దీనిని 747 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చనున్నారు. ఈ కక్ష్య సర్దుబాట్లకు 45 నుంచి 50 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నాసా ప్రకృతి విపత్తుల పరిశోధన విభాగం ప్రోగ్రామ్ మేనేజర్ గెరాల్డ్ డబ్ల్యూ బాడెన్ తెలిపారు. ఈ ఉపగ్రహంలోని రెండు రకాలు ఉన్న సింథటిక్ అపెర్చర్ రాడార్లను ప్రారంభించిన తర్వాత, అవి భూమిపైని మేఘాలు, మంచు, నేల భూమి మార్పులకు సంబంధించిన అధిక స్పష్టత గల డేటాను సేకరించడం ప్రారంభిస్తాయి.

Details

అధిక పరిణామంలో డేటాను ఇచ్చే అవకాశం

ప్రతీ 12 రోజులకు ఒకసారి ఒకే ప్రదేశాన్ని స్కాన్ చేయడం ద్వారా, ఈ ఉపగ్రహం 5×5 మీటర్ల స్థాయిలో స్పష్టమైన చిత్రాలను అందించగలదు. గతంలో నాసా-ఇస్రో పంపిన శాటిలైట్లతో పోలిస్తే, నైసార్ మరింత అధిక పరిమాణంలో డేటాను ఇస్తుందన్నారు. శాస్త్రీయ పరిశోధనల వలన సామాజిక ప్రయోజనం ఎలా సాధించవచ్చన్న అంశాన్ని నాసా, ఇస్రో కలిసి తెలుసుకున్నాయని, ఒకే శాటిలైట్‌లో రెండు రకాలు ఉన్న రాడార్లను ఏర్పాటు చేసి పరిశీలన చేయడం ఇదే మొదటిసారి అని గెరాల్డ్ వివరించారు.

Details

భారత అంతరిక్ష రంగానికే గర్వకారణం

తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16 ద్వారా నైసార్‌ను నింగిలోకి పంపడం ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఉపగ్రహ ప్రయోగాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. నాసాతో కలిసి అత్యంత క్లిష్టమైన ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడం, పైగా భారత్ స్వదేశీ వాహకనౌకతో దాన్ని విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. నైసార్ ద్వారా భూమిపై భౌగోళిక మార్పులు, భూకంపాలు, మంచు కరగడం, అడవుల నాశనం తదితర అంశాలపై విపులంగా సమాచారాన్ని సేకరించవచ్చు. ఇది భవిష్యత్ వాతావరణ, ప్రకృతి విపత్తుల అంచనాల్లో కీలక పాత్ర పోషించనుంది.