OpenAI: చాట్‌జీపీటీ యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకు విస్తృతంగా పెరుగుతోంది.
ఇప్పటికే ఈ రంగంలో సేవలు అందిస్తున్న సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
దీనితో, యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఆయా సంస్థలు కొత్త మోడళ్లను, అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో, తాజాగా ఓపెన్‌ఏఐ సంస్థ తన చాట్‌జీపీటీ (ChatGPT)లో కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
అత్యాధునిక విజువల్ మోడల్ జీపీటీ-4o అనుసంధానంతో దీన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించింది.
వివరాలు
అద్భుతమైన చిత్రాలను సృష్టించవచ్చు
చాట్‌జీపీటీ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈకొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman)'ఎక్స్' వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఈ ఫీచర్‌ను అద్భుతమైన సాంకేతికతగా ఆయన అభివర్ణించారు.
ఈ ఫీచర్ సహాయంతో రూపొందించిన కొన్ని చిత్రాలు నిజంగా ఏఐ ద్వారా రూపొందించబడినవేనా అనే విషయంలో యూజర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
దీని ద్వారా యూజర్లు అద్భుతమైన చిత్రాలను సృష్టించగలరని తెలిపారు. అయితే, అభ్యంతరకరమైన కంటెంట్‌ను సృష్టించరాదని యూజర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
మునుపటి ఏఐ మోడళ్లతో పోలిస్తే,జీపీటీ-4o మరింత మెరుగైన పనితీరును అందిస్తుందని ఓపెన్‌ఏఐ తెలిపింది.
ఈ మోడల్ మెరుగైన ఖచ్చితత్వం, సందర్భ అనుసంధానం, మరియు విశ్లేషణ సామర్థ్యాలతో చిత్రాలను రూపొందించడానికి శిక్షణ పొందిందని సంస్థ వెల్లడించింది.
వివరాలు
డెవలపర్లు API ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు
గత మోడళ్లలో ఉన్న పరిమితులను అధిగమిస్తూ, దీని సామర్థ్యాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
అయితే, నాన్-లాటిన్ భాషల్లో ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో చిత్రాలను రెండరింగ్ చేసే సమయంలో చిన్న సమస్యలు ఎదురుకావచ్చని పేర్కొంది.
కొన్ని సందర్భాల్లో తప్పుగా క్రాప్ చేసే అవకాశముండొచ్చని, అత్యంత సంక్లిష్టమైన చిత్రాలను రూపొందించే సమయంలో కొన్ని సందర్భాల్లో అనుకున్న విధంగా పనిచేయకపోవచ్చని తెలిపింది.
అయితే, ఈ సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ఇప్పటికే రోలవుట్ చేయబడిందని, త్వరలోనే చాట్‌జీపీటీ ప్లస్,ప్రో,టీమ్ యూజర్లతో పాటు ఉచిత యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని సంస్థ తెలిపింది.
అలాగే, డెవలపర్లు API ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చని కూడా వెల్లడించింది.