చంద్రయాన్-3 విజయం: ఇస్రో శాస్త్రవేత్తలను పొగడ్తలతో ముంచెత్తిన పాకిస్తాన్
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడి మీద సురక్షితంగా చంద్రయాన్-3 ల్యాండ్ కావడంతో భారతీయులు విజయగర్వంతో ఉప్పొంగిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం సాధించిన విజయానికి ప్రశంసలు వచ్చాయి.
తాజాగా మన పొరుగుదేశం పాకిస్తాన్ నుండి ప్రశంసలు వచ్చాయి. పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ముంతాజ్ జోహ్రా, చంద్రయాన్-3 విజయంపై అధికారికంగా స్పందించారు.
ఒకానొక ఇంటర్వ్యూలో ముంతాజ్ జోహ్రా మాట్లాడుతుండగా, చంద్రయాన్-3 విజయంపై స్పందించమని అడగడంతో, ఇది వైజ్ఞానికంగా గొప్ప విజయం, ఇస్రో శాస్త్రవేత్తలు ప్రశంసలకు అర్హులు అంటూ కామెంట్స్ చేసారు.
పాకిస్తాన్ నుండి అధికారికంగా రావడం కాస్త లేటయ్యింది కానీ పాకిస్తాన్ మీడియాలో మాత్రం చంద్రయాన్-3 విజయం గురించి వార్తలు తొందరగానే వచ్చాయి.
Details
చంద్రయాన్-3 అద్భుతమని కొనియాడిన పాకిస్తాన్ వార్తాపత్రికలు
చంద్రయాన్-3 విజయంపై ద డాన్ న్యూస్ పేపర్ మొదటి పేజీలో కథనాలను రాసుకొచ్చింది.
చంద్రయాన్-3 విజయం చరిత్రలో నిలిచిపోతుందని కథనాలను రాసిన ద డాన్, తక్కువ బడ్జెట్ లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని పూర్తి చేయడంపై ప్రశంసలు కురిపించింది.
ఇంకా, ఈ విజయానికి కారణం ప్రభుత్వం మద్దతుతో పాటు, ఇస్రో ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కృషి అని వార్తలు రాసింది.
అలాగే ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా పత్రిక, చంద్రయాన్-3 విజయం అద్భుతమనీ, రష్యా, అమెరికా, చైనా దేశాలు చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటే తక్కువ బడ్జెట్ లో ఇస్రో విజయం సాధించిందని తెలిపింది.