Page Loader
Smiley Face In The Sky: ఆకాశంలో "స్మైలీ ఫేస్".. ఆవిష్కృతం కానున్న అద్భుతం..!
ఆకాశంలో "స్మైలీ ఫేస్".. ఆవిష్కృతం కానున్న అద్భుతం..!

Smiley Face In The Sky: ఆకాశంలో "స్మైలీ ఫేస్".. ఆవిష్కృతం కానున్న అద్భుతం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఖగోళ ప్రపంచంలో ఇంకొక అద్భుత దృశ్యం మానవ కళ్లు చూచేందుకు సిద్ధంగా ఉంది. సౌరమండలానికి చెందిన రెండు ప్రధాన గ్రహాలు,నెలవంక (చంద్రుడు) సమీపంలోకి చేరుకొనడం వల్ల ఆకాశంలో ఒక "స్మైలీ ముఖం" (Smiley Face) మాదిరిగా కనిపించనుందని శాస్త్రీయ వెబ్‌సైట్ 'లైవ్‌సైన్స్‌' వెల్లడించింది. ఈ విశేషమైన దృశ్యం ఏప్రిల్ 25న తెల్లవారుజామున చోటుచేసుకోనుంది. ఆ రోజున శుక్రగ్రహం,శనిగ్రహం,అలాగే నెలవంక (Venus, Saturn, crescent moon) ఒకే ప్రాంతంలో అత్యంత సమీపంగా ప్రత్యక్షమవుతాయి. ఈ మూడు ఖగోళ వస్తువులు ఒకే విభాగంలో ఉండటంతో అవి కలిపి చిరునవ్వుతో కూడిన ముఖాన్ని పోలిన ఆకృతిని ఏర్పరచనున్నాయి.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా చూసే అవకాశం

ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా చూసే అవకాశం ఉంది. ఒక్కటే షరతు, ఆకాశం స్వచ్చంగా ఉండాలి. సూర్యోదయం కంటే కొద్దిసేపటి ముందు తూర్పు దిశలో భూమి లేదా సముద్రతీరానికి దగ్గరగా ఉండే ఆకాశరేఖ (Eastern horizon) వద్ద దీన్ని గమనించవచ్చు. ఆ రేఖపై శుక్రుడు పైభాగంలో, శని కొద్దిగా కిందవైపు, ఇంకా దిగువన నెలవంక ఒకే రేఖలో కనిపించనున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో శుక్రుడు, శని రెండు నయనాల్లా, నెలవంక చిరునవ్వుతో కూడిన పెదాల్లా కనిపించి స్మైలీ ముఖాన్ని తలపించనున్నాయి. ఈ విషయాలను అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో సౌర వ్యవస్థ అంబాసిడర్‌గా ఉన్న బ్రెండా కల్బర్ట్సన్ వెల్లడించారు.

వివరాలు 

ఆకాశంలో ఎలాంటి మేఘాలు ఉండకూడదు 

శుక్రుడు, శని చాలా ప్రకాశవంతంగా ఉండే గ్రహాలు కావడంతో వాటిని మామూలుగా వీక్షించవచ్చు. అయితే స్మైలీ ముఖం రూపాన్ని స్పష్టంగా చూడాలంటే ప్రత్యేకమైన స్టార్‌గేజింగ్ బైనాక్యులర్‌లు లేదా టెలిస్కోప్‌లు అవసరం అవుతాయని ఆమె తెలిపారు. ఇక అదే సమయంలో, ఈ మూడు వస్తువుల కిందివైపు బుధుడిని కూడా చూడవచ్చని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కానీ దీనికీ ఆకాశంలో ఎలాంటి మేఘాలు ఉండకూడదు.