దూసుకెళ్తున్న థ్రెడ్స్ యాప్.. రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్..!
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ యాప్ విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమంది పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే థ్రెడ్స్ యూరోపియన్ యూనియన్ లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో అందుబాటులోకివచ్చింది. థ్రెడ్ విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే 10 కోట్ల డౌన్ లోడ్స్ కు చేరుకొని రికార్డు సృష్టించింది. గతంలో చాట్ జీపీటి పేరు మీదున్న ఈ రికార్డును థ్రెడ్స్ బద్దలు కొట్టింది. మరోవైపు ట్విట్టర్ లో ఉండే పూర్తిస్థాయి ఫీచర్లు థ్రెడ్స్ లోని లేవని వినియోగదారులు చెబుతున్నారు.
తగ్గుతున్న థ్రెడ్ యాప్ ప్రభావం
అయితే థ్రెడ్‌లలో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లేవని వినియోగదారులు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనది 'ఫాలోయింగ్' ట్యాబ్ అని చెప్పొచ్చు. అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్‌లను చూపే 'ట్రెండింగ్' విభాగం కూడా థ్రెడ్ లో లేకపోవడం గమనార్హం. చాలా మంది వినియోగదారులు దీనిపై ఫిర్యాదు చేయడంతో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి స్పందించారు. త్వరలోనే ఈ ఫీచర్లను థ్రెడ్స్ లోకి అందుబాటులోకి తేస్తామని హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా థ్రెడ్ యాప్ ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే 70శాతం వరకు తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కొన్ని ప్రధానమైన ఫీచర్లు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.