
Lunar Eclipse: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. రాష్ట్రవ్యాప్తంగా మూతపడనున్న ప్రముఖ దేవాలయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 1:26 గంటల వరకు కొనసాగనుంది. ఈగ్రహణం శతభిష, పూర్వభద్ర నక్షత్రాల మధ్య సంభవించనున్నందున పండితులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నేడు మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి మహా నివేదన అనంతరం మూసివేయబడనుంది. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ కూడా ద్వారబంధనం చేయబడతాయి. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి హోమపూజలు నిర్వహించి, ఉదయం 9:30 నుండి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. వేములవాడ రాజన్న ఆలయం నేడు ఉదయం 11:25 గంటలకు మూసివేయబడనుంది.
Details
రెండ్రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
చంద్రగ్రహణం ముగిసిన తరువాత, సోమవారం ఉదయం 3:45 గంటల వరకు ఆలయం మూసే ఉంటుంది. అనంతరం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజలు పూర్తయ్యాక దర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రెండు రోజులపాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం నేడు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేయనున్నారు. అనుబంధ ఆలయాల ద్వారాలు కూడా ఈ క్రమంలో బంద్ చేయబడతాయి. రేపు ఉదయం 7:30 గంటలకు శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి, అనంతరం దర్శనాన్ని ప్రారంభిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.