Moon Landing: చరిత్ర సృష్టించిన 'ఫైర్‌ఫ్లై' ఏరోస్పేస్ సంస్థ.. చంద్రుడిపై 'బ్లూ ఘోస్ట్'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్' సరికొత్త చరిత్ర లిఖించింది.
ఆ సంస్థ ప్రయోగించిన 'బ్లూ ఘోస్ట్' ల్యాండర్ దీర్ఘకాల ప్రయాణం అనంతరం ఆదివారం చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగింది.
టెక్సాస్‌లోని 'ఫైర్‌ఫ్లై' మిషన్ కంట్రోల్ కేంద్రం ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో చంద్రుని ఉపరితలంపై స్థిరంగా ల్యాండింగ్ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా 'ఫైర్‌ఫ్లై' రికార్డు సృష్టించింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని 'స్పేస్-X ' కంపెనీకి చెందిన 'ఫాల్కన్-9' రాకెట్ జనవరి 15న ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి 'బ్లూ ఘోస్ట్' తో పాటు జపాన్ 'ఐస్పేస్' సంస్థకు చెందిన మరో ల్యాండర్ 'హకుటో ఆర్-2' ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది.
వివరాలు
ఫైర్‌ఫ్లై సంస్థకు నాసా 145 మిలియన్ డాలర్లు
6 అడుగుల (2 మీటర్ల) పొడవు, 11 అడుగుల (3.5 మీటర్ల) వెడల్పుతో బంగారు రంగులో మెరుస్తూ 'బ్లూ ఘోస్ట్' ల్యాండర్ చంద్రుని కక్ష్య నుంచి ఆటోపైలట్ విధానంలో ఈశాన్య అంచున ఉన్న 'మోన్స్ లాట్రెయిల్లే' ప్రాంతంలో దిగింది.
ఈ ల్యాండర్ ప్రయోగంలో ప్రధాన లక్ష్యాలు:
వాక్యూమ్ ద్వారా చంద్రుడి ధూళిని సేకరించడం
చంద్రుని ఉపరితలాన్ని డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను కొలవడం
వ్యోమగాముల స్పేస్‌సూట్లు, పరికరాలకు అంటుకునే హానికరమైన ధూళిని తొలగించే పరికరాన్ని పరీక్షించడం
నాసాకు చెందిన 10 ప్రయోగాలను నిర్వహించడం ఈ ప్రయోగాల నిర్వహణ కోసం నాసా, ఫైర్‌ఫ్లై సంస్థకు 145 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,268 కోట్లు) మంజూరు చేసింది.
వివరాలు
చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కి.మీ దూరంలో మరో ల్యాండర్
హ్యూస్టన్‌లోని 'ఇంట్యూయిటివ్ మెషీన్స్' అనే సంస్థ రూపొందించిన మరో ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కి.మీ దూరంలో ఉంది.
శాస్త్రవేత్తలు దీన్ని గురువారం చంద్రుని ఉపరితలంపై దిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గతంలో ఈ సంస్థ మొదటి ల్యాండర్‌ను చంద్రుడిపై దిగజేయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.
ల్యాండర్ కాలు విరిగిపోవడం వల్ల అది ఉపరితలంపై ఒరిగిపోయింది. ఇక, 'బ్లూ ఘోస్ట్'తో పాటు నింగిలోకి వెళ్లిన 'హకుటో ఆర్-2' ల్యాండర్ మే నెలాఖరు లేదా జూన్ ప్రారంభంలో చంద్రునిపై దిగనుంది.
ఇది 'ఐస్పేస్' సంస్థ చంద్రుడిపై ల్యాండర్‌ను దింపేందుకు చేస్తున్న రెండో ప్రయత్నం. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ప్రయోగించిన తొలి ల్యాండర్ చంద్రునిపై కూలిపోయింది.