Sam Altman: 'చాట్‌జీపీటీ వినియోగించి దుండగుడు నా భర్తను హత్య చేశాడు': శామ్ ఆల్ట్‌మన్‌పై వందనా జోషీ కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 2025 ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై భారతీయ మూలాల మహిళ వందనా జోషీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనలో ఆమె భర్త తిరు ఛబ్బా ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన ఫీనిక్స్ ఇక్నెర్ దాడికి ముందు నెలల తరబడి చాట్‌జీపీటీ ద్వారా వివిధ అంశాలపై సమాచారం సేకరించినట్లు ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వందనా జోషీ ఆరోపణల ప్రకారం,ఇక్నెర్ చాట్‌జీపీటీకి దాదాపు 10వేల సందేశాలు పంపి తుపాకులు, ఆత్మహత్యలు,సామూహిక కాల్పులు వంటి అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. అంతేకాకుండా,ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌లో ఎక్కువ రద్దీ ఉండే సమయం గురించి కూడా చాట్‌జీపీటీని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
ఆరోపణలను తిరస్కరించిన ఓపెన్‌ఏఐ
దీనికి వారంలో పని దినాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు లంచ్ సమయం అత్యంత రద్దీగా ఉంటుందని సమాధానం వచ్చినట్లు ఆరోపించారు. ఈ సమాచారం ఆధారంగానే కాల్పులు జరిగిన రోజు ఇక్నెర్ ఉదయం 11.59 గంటలకు స్టూడెంట్ యూనియన్‌కు చేరుకున్నాడని, మొత్తం దాడి ప్రణాళికలో చాట్‌జీపీటీ కీలక పాత్ర పోషించిందని జోషీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఓపెన్‌ఏఐ ఖండించింది. భయంకరమైన నేరాలకు చాట్‌జీపీటీని బాధ్యురాలిగా నిలపడం సరికాదని స్పష్టం చేసింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న సాధారణ సమాచారాన్ని మాత్రమే చాట్‌జీపీటీ అందించిందని పేర్కొంది. అక్రమ, ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలను ప్రోత్సహించకుండా ఉండేందుకు తమ భద్రతా వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుస్తున్నామని వెల్లడించింది.
వివరాలు
పిల్లలకు హాని చేస్తోందంటూ మరో దావా
ఇదిలా ఉండగా, చాట్‌జీపీటీ పిల్లలకు హానికరమైన సమాచారాన్ని అందిస్తోందంటూ ఫ్లోరిడా కోర్టులో మరో కేసు నమోదైంది. పాఠశాలల్లో కాల్పులకు పాల్పడే వ్యక్తులకు ఉపయోగపడే ప్రమాదకర సమాచారాన్ని ఈ వేదిక అందిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐతో పాటు శామ్ ఆల్ట్‌మన్‌పై ఈ తరహా న్యాయపరమైన చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రంగా ఫ్లోరిడా నిలిచింది. చాట్‌జీపీటీలో కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో శామ్ ఆల్ట్‌మన్ కీలక పాత్ర పోషించినందున ఆయన పేరును కూడా కేసులో చేర్చినట్లు రాష్ట్ర అటార్నీ జనరల్ వెల్లడించారు.