LOADING...
Amit Kshatriya: నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో-అమెరికన్ నియామకం.. ఎవరీ అమిత్ క్షత్రియ?
ఎవరీ అమిత్ క్షత్రియ?

Amit Kshatriya: నాసా కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో-అమెరికన్ నియామకం.. ఎవరీ అమిత్ క్షత్రియ?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో అగ్రస్థాయి పదవికి భారతీయ మూలాల అమెరికన్ అమిత్ క్షత్రియ నియమితులయ్యారు. ఆయనను నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా నియమించినట్టు అధికారులు ప్రకటించారు. ఇది నాసా లో అత్యున్నత సివిల్ సర్వీస్ రోల్. ఈ నియామకంతో అమెరికాలోని భారతీయులు గర్వంగా భావిస్తున్నారు. అమిత్ నాయకత్వంలో నాసా, చంద్రయానం ఆర్టెమిస్ మిషన్పై దృష్టి పెట్టనుంది. అమెరికా, చైనా కంటే ముందే చంద్రునిపైకి తిరిగి వెళ్లాలని ప్రణాళికలు వేస్తోంది. అలాగే, నాసా ప్రైవేట్ స్పేస్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని పెంచనుంది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలతో కలిసి పనిచేసి కొత్త ఆవిష్కరణలు వేగంగా చేయడం, ఖర్చులు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

నాసా నాయకత్వం స్పందన

అంతేకాక, సంక్లిష్టమైన మిషన్లను భద్రంగా,సమర్థంగా నడిపించడంలో అమిత్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. మొత్తం మీద, నాసా అంతరిక్ష అన్వేషణలో కొత్త దశను ఆరంభించేందుకు అమిత్ క్షత్రియను ఆర్కిటెక్ట్గా నిలబెట్టాలని చూస్తోంది. దీని ద్వారా అమెరికా అంతరిక్ష ఆధిపత్యం మరింత బలపడుతుందని,కొత్త తరాల శాస్త్రవేత్తలకు ప్రేరణ కలుగుతుందని భావిస్తోంది. "గత రెండు దశాబ్దాలుగా అమిత్ నాసాకు సేవ చేస్తున్నారు,అమెరికా స్పేస్ లీడర్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలంలోనే చంద్రయానం మళ్లీ ప్రారంభించేందుకు ఆయన నాయకత్వం దోహదం చేస్తుంది.అమిత్ జ్ఞానం,నిబద్ధత, నిజాయితీ కొత్త యుగానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆయనతో కలిసి మేము మరిన్ని అసాధ్యాలను సాధ్యంగా మలుస్తాం"అని నాసా అధిపతి డఫీ పేర్కొన్నారు.

వివరాలు 

చంద్రుడు నుంచి మంగళ గ్రహం వరకూ మన ప్రణాళికను ముందుకు తీసుకెళ్తా: అమిత్ 

"నా కెరీర్ అంతా ఒకే లక్ష్యం నన్ను నడిపించింది. మానవ అంతరిక్ష యాత్రలో సాధ్యాసాధ్యాల గీతలను దాటి ముందుకు సాగడం. ఈ కొత్త బాధ్యతతో మన మూన్ టు మార్స్ వ్యూహాన్ని తీర్చిదిద్దే అవకాశం దక్కింది. అంతేకాక, వాణిజ్య అంతరిక్ష రంగంతో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయగలమని నమ్ముతున్నాను" అని అమిత్ అన్నారు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ప్రాధాన్యాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ, "ఇది చంద్రుని వైపు తిరిగి వెళ్లే మూలస్తంభం మాత్రమే కాదు, మంగళ గ్రహ యాత్రకు కూడా ద్వారం" అని స్పష్టం చేశారు.

వివరాలు 

అమిత్ క్షత్రియ విద్యా ప్రస్థానం 

నాసా అగ్రపదవికి చేరిన అమిత్ క్షత్రియ అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, బ్రూక్‌ఫీల్డ్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మొదటి తరం భారతీయ వలసదారులు. విద్యార్హతల విషయానికి వస్తే, క్షత్రియ కెలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పసడీనా నుంచి బాచిలర్ ఆఫ్ సైన్స్ (గణితం) డిగ్రీ పొందారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి గణితంలో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసాలో తన సేవలకుగాను ఆయనకు ఔట్‌స్టాండింగ్ లీడర్‌షిప్ మెడల్ లభించింది. ముఖ్యంగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు జరిగిన 50వ ఎక్స్‌పెడిషన్ మిషన్లో లీడ్ ఫ్లైట్ డైరెక్టర్‌గా పని చేసినందుకు ఈ గౌరవం దక్కింది.