YouTube: కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. కొత్త ఫీచర్‌తో మరింత ఆదాయం!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) కంటెంట్ క్రియేటర్లకు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఒక కొత్త సదుపాయాన్ని అందించింది. కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునేలా షాపింగ్ అనుబంధ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త షాపింగ్ ప్రోగ్రామ్‌ను యూట్యూబ్ ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా, ఈ సేవలను భారత్ సహా మరిన్ని దేశాలకు విస్తరించింది. దీనిలో భాగంగా యూట్యూబ్ మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. అర్హత ఉన్న కంటెంట్ క్రియేటర్లందరికీ ఈ సదుపాయం లభించనుంది.
వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు.
వీడియో క్రియేటర్లు ఈ ఫీచర్ వినియోగించుకోవాలంటే ముందుగా యూట్యూబ్ షాపింగ్‌లో సైన్‌అప్ అవ్వాలి. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ వారి అప్లికేషన్‌ను ఆమోదించిన తర్వాత ఈ సదుపాయాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఆపై, వారు తమ వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు. యూజర్లకు ఆ ఉత్పత్తులు నచ్చితే పక్కనే ఉన్న షాపింగ్ చిహ్నంపై క్లిక్ చేసి, పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీనికోసం వేరే బ్రౌజర్ పేజ్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు; వివరాలు అక్కడే అందుబాటులో ఉంటాయి.
ఆ క్రియేటర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు
కంటెంట్ క్రియేటర్లు ప్రమోట్ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే, వారికి కమీషన్ లభిస్తుంది. ట్యాగ్ చేస్తున్న సమయంలోనే కమీషన్ వివరాలు తెలుసుకోవచ్చు. ఒక వీడియోకు 30 వరకు ఉత్పత్తులను ట్యాగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని 10,000 మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు కలిగిన క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే పిల్లల కోసం లేదా మ్యూజిక్ ఛానళ్లు నడిపే క్రియేటర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదని యూట్యూబ్ తెలిపింది.