South africa: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించిన సౌతాఫ్రికా
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 10న జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించింది.
మెజారిటీ ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనడం వల్ల ఈ టోర్నీలో ఆ జట్టుకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది.
సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యులతోనే జట్టును ఎంపిక చేయడం వల్ల సమస్య తలెత్తింది.
ఈ 12 మంది ఆటగాళ్లలో ఇద్దరు ఎమర్జెన్సీ కారణంగా మైదానం విడిచిపెట్టడంతో ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు తప్పనిసరిగా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు.
Details
మాథ్యూ బ్రీట్జ్కీ 150 పరుగులు
అయితే ఇది సౌతాఫ్రికా జట్టుకు కొత్తేమీ కాదు. గత సీజన్‌లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ కూడా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా అడుగుపెట్టాడు.
ఈ ఆసక్తికర ఘటనను పక్కన పెడితే, మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, అరంగేట్రం చేసిన యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) ఘన శతకం బాదడంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును చేరిన తొలి ఆటగాడిగా బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Details
8 బంతులు మిగిలుండగానే విజయం
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వియాన్ ముల్దర్ (64) అర్థశతకం సాధించగా, జే స్మిత్ (41) సముచిత స్కోర్ అందించారు.
కానీ కెప్టెన్ బవుమా (20), కైల్ వెర్రిన్ (1), ముత్తుసామి (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. బౌలింగ్‌లో న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో రెండు వికెట్లు తీసుకోగా, బ్రేస్‌వెల్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్, కేన్ విలియమ్సన్ (133*) అజేయ శతకంతో విజృంభించడంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
డెవాన్ కాన్వే (97) తృటిలో సెంచరీను మిస్ చేసుకున్నా, న్యూజిలాండ్ విజయంలో కీలక భూమిక పోషించాడు.
Details
7వేల పరుగుల సాధించిన రెండో ప్లేయర్ గా విలియమ్సన్ రికార్డు
విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ (28 నాటౌట్)తో కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (19), డారిల్ మిచెల్ (10), టామ్ లాథమ్ (0) విఫలమయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2 వికెట్లు తీయగా, ఈథన్ బాష్, జూనియర్ డాలా తలో వికెట్ సాధించారు.
ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.