Gautam Gambhir: భారత్ బాగా ఆడలేదు.. అత్యుత్తమ జట్టే ప్రపంచ కప్ గెలిచింది : గౌతమ్ గంభీర్
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఓటమి లేకుండా భారత్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ సాధించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. అయితే ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలవడంపై పలువురు మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టు ప్రపంచ కప్ గెలవలేదని, ఈ టోర్నీలో టీమిండియానే బెస్ట్ అని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్‌తో పాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ వాదనలను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కొట్టిపారేశాడు. ఇది వింత వాదన అని, అత్యుత్తమ జట్టే విశ్వ విజేతగా నిలిచిందని గంభీర్ పేర్కొన్నాడు.
అత్యుత్తమ జట్టు ప్రపంచ కప్ గెలవలేదని చెప్పడం అవాస్తవం
చాలామందికి తాను చెప్పేది నచ్చకపోవచ్చు అని, అత్యుత్తమ జట్టు ప్రపంచ కప్ గెలవలేదని కొంతమంది చెప్పడం అవాస్తమని గంభీర్ తెలిపాడు. టీమిండియా వరుసగా 10 మ్యాచులు గెలిచింది కానీ, ఒక మ్యాచులో పేలవంగా ఆడిందని, లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచామా లేదా 4వ స్థానంలో నిలిచామా అనేది ముఖ్యం కాదని చెప్పాడు. అత్యుత్తమ జట్టు ప్రపంచ కప్ సాధించిందని, దీన్ని అంతా అంగీకరించాలని, ఫైనల్‌లో భారత్ బాగా ఆడలేదని స్పోర్ట్స్‌కీడాతో గంభీర్ వివరించాడు.