Aaqib Javed: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు.. కోచ్ అకిబ్‌పై వేటు?
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీగా ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం ఆ దేశ క్రికెట్ బోర్డులో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
ఈ జట్టు తాత్కాలిక కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలగించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం.
గత ఏడాది గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేసిన తరువాత,పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వి అకిబ్ జావెద్‌ను పాకిస్థాన్ పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా నియమించారు.
అనంతరం,జాసన్ గిల్లెస్పీ తప్పుకున్న నేపథ్యంలో,టెస్టు జట్టుకు కూడా అకిబ్ కోచ్‌గా కొనసాగించారు.
అయితే,తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ దారుణ ప్రదర్శనతో,అకిబ్‌ను కోచ్‌గా కొనసాగించడం ఇక కష్టమని భావిస్తున్నారు.
వివరాలు
మా జట్టు పోటీలో లేకపోతే, అభిమానులు ఆసక్తి చూపిస్తారా..?
అతడితో పాటు, మొత్తం సహాయక సిబ్బందినీ తొలగించే యోచనలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కారణంగా భవిష్యత్తులో జట్టుకు కొత్త స్పాన్సర్లు దొరుకుతారా లేదా అనే అనుమానంతో పీసీబీ ఆందోళన చెందుతోంది.
అంతేకాక, టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్‌లకు అభిమానుల నుంచి ఏమాత్రం స్పందన ఉంటుందోనని కూడా బోర్డు తీవ్రంగా ఆలోచిస్తోంది.
''మా జట్టు పోటీలో లేకపోతే, అభిమానులు ఆసక్తి చూపిస్తారా అన్నదే ప్రధాన ప్రశ్న.
ప్రేక్షకులు తక్కువగా ఉండడం ప్రసారదారులకు సమస్యగా మారుతుంది.
దీని ప్రభావం భవిష్యత్తులో పాక్ క్రికెట్‌పై పడుతుంది. స్పాన్సర్లు కూడా నమ్మకంతో ముందుకు వస్తారా అనే సందేహం ఉంది,'' అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.