AFG vs NZ: ఒక్క బంతి కూడా పడకుండా టెస్టు మ్యాచ్ రద్దు.. 91 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..
గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్ - న్యూజిలాండ్ (AFG vs NZ) జట్ల మధ్య ఏకైక టెస్టు వర్షం కారణంగా రద్దైంది. ఐదు రోజుల పాటు వర్షం కారణంగా ఆట జరగలేకపోయింది. కనీసం టాస్ కూడా వేయడం సాధ్యం కాకపోయింది. మొదటి రోజు వర్షం ఆగినప్పటికీ, మైదానం చిత్తడిగా ఉండటంతో ఆటకు అనుకూలంగా లేదు. గ్రేటర్ నోయిడా స్టేడియంలో పిచ్‌ను త్వరగా సిద్ధం చేసే సదుపాయాలు అందుబాటులో లేవు, ఈ విషయంపై క్రికెట్ వర్గాలు తీవ్ర విమర్శలు గుచ్చాయి. రెండో రోజు నుంచి మళ్లీ వర్షం పడడంతో ఆట రద్దవుతూ వచ్చింది. చివరిరోజున కూడా ఆడేందుకు అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని ప్రకటించారు.
పాక్-జింబాబ్వే మధ్య పూర్తి మ్యాచ్ రద్దు
91 ఏళ్ల తర్వాత భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్ పూర్తిగా రద్దవడం ఇదే మొదటిసారి. 1933లో భారత్‌లో మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆసియాలో 1998లో పాక్-జింబాబ్వే మధ్య వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైంది. ప్రపంచ టెస్టు చరిత్రలో ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ ఆగడం ఇది 8వసారి. అందులో మూడు సార్లు కివీస్ ప్రత్యర్థిగా ఉండటం గమనార్హం. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య 1890, 1938, 1970లో మూడు మ్యాచ్‌లు, న్యూజిలాండ్-పాక్ 1989, వెస్టిండీస్-ఇంగ్లండ్ 1998, భారత్-న్యూజిలాండ్ 1998, పాక్-జింబాబ్వే 1998, అఫ్గాన్-కివీస్ 2024 మధ్య టెస్టులు జరగలేదు.